ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కొన్ని అంశాలపై వివరణ కోరారు. తొలుత ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందని ఆమె 6 అంశాలపై వివరణలు కోరారు. ఆ అంశాలు ఇలా ఉన్నాయి. 1. కేంద్ర వాటా ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమా కాదా?. 2. ఆర్టీసీ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు సమర్పించాలి. 3. తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాల రక్షణకు తీసుకున్న చర్యలేంటి? 4. ఆర్టీసీ స్థిర, చరాస్తుల వివరాలు తెలపాలి. ఆర్టీసీ స్థలాలు, భవనాలను ప్రభుత్వం తీసుకుంటుందా?  5. బస్సులు, ఉద్యోగుల నిర్వహణను ఎవరు చూస్తారు? సిబ్బంది ప్రయోజనాల రక్షణలో కార్పొరేషన్ పాత్ర ఎలా ఉంటుంది? 6. ఆర్టీసీ ఉద్యోగులు డిప్యుటేషన్ పై సంస్థలోనే పనిచేస్తారా? అని ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి గవర్నర్ అడిగిన అంశాలకు వివరణ ఇచ్చింది.


తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం పంపిన బిల్లుకు ఆమోదం లభించినట్లు ప్రచారం జరిగింది.  బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపితే  ప్రభుత్వం ఏ క్షణమైనా అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 31వ తేదీన తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామలుగా అసెంబ్లీలో పాసయిన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.  ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు వెళ్లింది. తాను ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపై స్పష్టత అడుగుతున్నానని, బిల్లును అడ్డుకునే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తమిళిసై నేడు కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.


అసెంబ్లీ సమావేశాలు పొడిగించి అయినా  బిల్లును ఆమోదించే చాన్స్                         


గవర్నర్ ఆమోదిస్తారన్న నమ్మకంతో మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ చివరి క్షణం వరకూ గవర్నర్ ఆమోదం చెప్పకపోవడంతో వివాదం ఏర్పడింది. గతంలో అసెంబ్లీలో పాసయిన చాలా బిల్లులను ఇలా పెడింగ్ లో పెట్టి కొన్ని వెనక్కి పంపిన ఉదంతాలు ఉండటంతో.. ప్రభుత్వం చురుకుగా స్పందించింది. కార్మిక సంఘాలను రంగంలోకి దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిల్లుపై కొన్ని సందేహాలున్నాయని.. ప్రభుత్వానికి రాజ్ భవన్ లేఖ పంపింది.ఈ లేఖకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సమాధానాలతో కూడిన లేఖను  రాజ్ భవన్ కార్యదర్శికి  ప్రభుత్వం పంపింది. 


గవర్నర్ సందేహాలకు వివరణ ఇచ్చిన  ప్రభుత్వం                              


ఆర్టీసీ ఎంప్లాయీస్​ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత వారికి ఇప్పటికన్నా మెరుగైన జీతాలు ఉంటాయని అందులో ఉంది. విలీనం తర్వాత విధివిధానాల్లో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ వివాదాన్ని ఏపీ ప్రభుత్వం డీల్​ చేసిన మాదిరిగా ఇక్కడా చేస్తామన్నారు. ప్రస్తుత చట్టపరమైన సంస్థ రూపంలోనే ఆర్టీసీ పని చేస్తుందని వివరణ ఇచ్చారు. 
ఆర్టీసీ బిల్లుపై  గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు  కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ హమీ ఇచ్చినట్లు వెల్లడించారు.  ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు.   అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు. 


ఆదివారం అసెంబ్లీలో ప్రసంగించనున్న కేసీఆర్                           


బిల్లు పెట్టి ఆమోదించడానికి ఆదివారం కూడా అసెంబ్లీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే చివరి సమావేశాలు కావడంతో ఆయన .. ప్రజలకు పూర్తి స్థాయిలో సందేశం ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.