KCR First Target Telangana:  భారత రాష్ట్ర సమితి కార్యకలాపాల్ని తెలంగాణలోనే ఎక్కువగా చేపడుతున్నారు కేసీఆర్. ఆవిర్భావ సభను కూడా తెలంగాణలోనే నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం గడప దాటడం లేదు. అసలు బీఆర్ఎస్‌ను దేశ ప్రజల ముందు ఉంచేందుకు  ఢిల్లీ లేదా యూపీల్లో భారీ  బహిరంగసభ ప్లాన్ చేశారన్న ప్రచారం జరిగింది. కానీ కనీసం ప్రెస్ మీట్ కూడా ఇప్పటి వరకూ పెట్టలేదు.

  


ముందు తెలంగాణలో గెలిచి చూపించాలి ! 


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బలపడాలంటే ముందుగా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటేనే దేశ రాజకీయాలలో ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ముందుగా ఇంట గెలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు బలంగా నిలబడాలని ఆయన కోరుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న భావనతోనే కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని గెలిపించాలన్న ఆయన భావన   అర్థమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మళ్లీ కట్టబెడితేనే దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. 


తెలంగాణలో ఓడిపోతే రాజకీయంగా పట్టించుకునేవారే ఉండరు ! 
 
ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది.  సొంత రాష్ట్రాల్లో ఓడిపోయి వారు సాధించిందేమీ లేదు.  కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ నుంచి గెలిచి సీఎం అయ్యారు కాబట్టి ప్రాధాన్యం లభిస్తోంది. మూడో సారి కూడా ముఖ్యమంత్రి అయితే తిరుగు ఉండదు. దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ వస్తుంది. కానీ అధికారం కోల్పోతే మాత్రం మాజీ సీఎంలలో ఆయన ఒకరిగా మిగిలిపోతారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆరు నెలల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధంచడానికి అడ్వాంటేజ్ లభిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించాల్సిన సమయమని చెప్పుకోవచ్చు. 
  
ఢిల్లీపై పోరాడుతున్న తెలంగాణ బిడ్డకు అండగా ఉండాలని కొత్త సెంటిమెంట్ అస్త్రం 
 
తెలంగాణ బిడ్డ ఢిల్లీ పీఠానికి గురి పెడుతున్నాడు.. మద్దతివ్వరా ? అనేది కేసీఆర్ ప్రచార వ్యూహం కావొచ్చునంటున్నారు. నవ్వేటోడి ముందు జారిపడేలా  చేయవద్దు అని కేసీఆర్ ఎక్కువగా చెబుతూంటారు.. ఇలాంటి వ్యూహంతోనే  తనను ఓడించి తెలంగాణ పరువు తీయవద్దని.. మనం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నామని ప్రజల మైండ్ సెట్ మార్చే వ్యూహం ఈ ప్లాన్‌లో ఉందని.. రాజకీయ సమీకరణాలు లెక్కలన్నీ వేసుకున్న తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. జాతీయ నాయకుల్ని పిలిపించి.. కేసీఆర్ బీజేపీకి ధీటుగా పోరాడగలరని  చెప్పించడం ద్వారా ప్రజల్లో మరింత మద్దతు పొందే ఆలోచనలు చేస్తారని అంటున్నారు. 


 తెలంగాణ ఎన్నికలయ్యే వరకూ బీఆర్ఎస్ రాజకీయం అంతా ఇక్కడే !


అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే వరకూ.. జాతీయస్థాయి నేతల ఇమేజ్ ను కూడా కేసీఆర్ తెలంగాణలో ఉపయోగించుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతానికి కమిటీలను నియమించినా రాజకీయం మాత్రం తెలంగాణలోనే చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్నదానిపై క్లారిటీ లేదు. ఉన్నా లేకపోయినా.. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.