Stone Pelting at Vande Bharat Express : దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్ కు చేరింది. అయితే సికింద్రాబాద్ - విజయవాడ - విశాఖపట్నం మధ్య త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ హై స్పీడ్ రైలు ట్రైల్ రన్ పై బుధవారం సాయంత్రం విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతంలో దాడి జరగడాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. కొందరు దేశద్రోహశక్తుల ప్రోత్సాహంతో దుండగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి చేశారని ఆరోపించారు.


దేశాభివృద్ధిలో కీలకమైన రైల్వేల అభివృద్ధిలో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన వందే భారత్ ప్రత్యేక హై స్పీడ్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ఓర్వలేని దుష్ట శక్తులు ఇలా దాడి చేశాయని సోము వీర్రాజు మండి పడ్డారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన దోషులను దుండగులను, ప్రోత్సహించిన దేశ వ్యతిరేక శక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈనెల 19వ తారీఖున ప్రారంభించనున్న ఈ రైలు రాకను ఎందుకు ఆ దుష్టశక్తులు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలు గమనించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.


నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు
రైలుపై దాడి జరిగిన ప్రదేశాన్ని వెస్ట్  ఏసిపి అన్నపు నరసింహమూర్తి ఆర్పిఎఫ్ అధికారి పరిశీలించారు. విశాఖ నగరానికి వచ్చిన వందే భారత్ రైలు పై కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి రైలు యొక్క అద్దం పగులుటకు కారణం అయ్యారు. తక్షణమే స్పందించిన విశాఖ నగర పోలీసులు జి.ఆర్.పి.ఎఫ్ కు, ఆర్.పి.ఎఫ్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ వెంటనే నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎంతో ప్రతిస్టాత్మాకముగా ప్రారంభమైన ఈ రైలు పై ఇటువంటి సంఘటన జరగడం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రముగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


అత్యంత వేగంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చే వందే భారత్ ట్రైన్ కు ప్రయాణికుల తాకిడి ఉంటుందని అధికారులు తెలిపారు. వందే భారత్ లో పూర్తిగా చైర్ కార్ బోగీలుంటాయని వెల్లడించారు. కేవలం 8.40 గంటల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.  విశాఖ చేరుకున్న వందే భారత్ రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.


ట్రయల్ రన్‌లో రైలుపై రాళ్లదాడి
గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో  ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. 


ప్రధాని మోదీ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో  వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా విశాఖ చేరుకుంటుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారవుతున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. దేశవ్యాప్తంగా ఐదు రైళ్లు పట్టాలెక్కాయి. మైసూర్‌-బెంగళూరు-చెన్నై మధ్య  నవంబర్‌ 10న వందే భారత్ రైలు పట్టాలెక్కింది. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్.