BRS MLC IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఆయన బంధువులు, పీఏ నివాసాల్లో వరుసగా నాల్గో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఐటీ సోదాలు ఒకటి, రెండు రోజుల్లో ముగిసిపోతాయి. పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులపై జరిగిన ఐటీ సోదాలు కూడా రెండు రోజుల్లో ముగిశాయి. కానీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో మాత్రం నాలుగు రోజులుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజపుష్ప విల్లాస్ లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం ఉంది.
రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ వెంకట్రామిరెడ్డి కుటుంబీకులే నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ తో పాటు జీఎస్టీ చెల్లింపులపైనా ఐటీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్ తో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా కంపెనీ హెడ్ క్వార్టర్స్, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు చేశారు. ముప్పా మెలోడీస్ పేరుతో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెల్లాపూర్ లో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాల భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి.
రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్ లోనే ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు పి. శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, ఎండీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్, సిబ్బంది ఇండ్లల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కు చెందిన దాదాపు 15 ప్రాంతాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ లో రాజపుష్ప కంపెనీ పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజ్ పుష్ప పలు సంస్థలతో ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రాజపుష్పతో పాటు ముప్పా , వెర్టెక్స్ కన్ స్ట్రక్షన్స్, వసుధ ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు జరిపారు. ఇవన్నీ ఒక సంస్థతో మరో సంస్థ కలిసి .. వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని ఐటీ అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా ఉండేవారు. గ్రూప్ వన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ప్రారంభించి ఆ తర్వాత ఆయన ఐఏఎస్ హోదా పొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కువ కాలం సిద్దిపేట కలెక్టర్ గా పని చేశారు. ఆయన సర్వీసులో ఉండగానే కుటుంబసభ్యులు రాజపుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ ప్రారంభించారు. భారీ వెంచర్లతో హైదరాబాద్ చుట్టుపక్కల హైరైజ్ అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆయన వీఆర్ఎస్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వెంటనే సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఐటీ దాడుల్లో ఆయన వ్యాపార సంస్థలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.