Chinese Spy Balloon:


చైనా స్పై బెలూన్..


అమెరికాలో చైనా స్పై బెలూన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అలెర్ట్ అయిన అగ్రరాజ్యం...సెన్సిటివ్ ఎయిర్‌ బేస్‌లు, స్ట్రాటెజిక్ మిజైల్స్ ఉన్న చోటే ఈ బెలూన్ ఎగురుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ స్పై బెలూన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోంది అమెరికా. మిలిటరీలోని ఉన్నతాధికారులు ఈ బెలూన్‌ను కాల్చేయాలని  చూస్తున్నారు. అధ్యక్షుడు బైడెన్‌ కూడా ఇందుకు ఓకే అన్నారు. కానీ...ఇలా చేయడం వల్ల కింద ఉన్న వాళ్లకు ప్రమాదం తలెత్తే అవకాశముందని ఆలోచనలో పడ్డారు అధికారులు. కేవలం తమపై నిఘా ఉంచేందుకే చైనా ఇలా స్పై బెలూన్‌ పంపిందని అమెరికా ఆరోపిస్తోంది. అంతే కాదు. ఈ బెలూన్ ఎగురుతున్న చోటే భూగర్భంలో న్యూక్లియర్ మిజైల్స్ కూడా ఉన్నాయని చెబుతోంది అగ్రరాజ్యం. అయితే...ఈ బెలూన్‌తో ప్రమాదమేమీ లేదని ప్రస్తుతానికి భావిస్తోంది. యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ మరి కొద్ది రోజుల్లోనే బీజింగ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ లోగా...స్పై బెలూన్ గాల్లో చక్కర్లు కొట్టడం సంచలనమవుతోంది. నిజానికి కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు పలుచనైపోయాయి. వాణిజ్యం విషయంలో రెండు దేశాల మధ్య దూరం, వైరం పెరిగిపోయింది. ముఖ్యంగా...తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని చైనా సహించడం లేదు. తైవాన్‌ ఆత్మరక్షణకు వీలుగా అమెరికా ఆయుధాలూ విక్రయిస్తుండటం డ్రాగన్‌కు చిరాకు తెప్పిస్తోంది. ఈ లోగా స్పై బెలూన్‌ వచ్చి వేడిని ఇంకాస్త పెంచింది. 


ట్రాకింగ్..


రెండ్రోజుల క్రితమే యూఎస్ ఎయిర్‌బేస్‌లోకి ఈ బెలూన్ వచ్చినప్పటికీ అంతకు ముందు నుంచే అధికారులు ఈ బెలూన్‌ని ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫైటర్‌ జెట్‌లను పంపించి ఈ బెలూన్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బెలూన్‌ చాలా ఎత్తులో ఎగురుతోందని, కింద ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదనీ వెల్లడించారు. అటు కెనడా రక్షణ శాఖ కూడా అమెరికాతో కలిసి బెలూన్‌ను ట్రాక్ చేస్తోంది. మిలిటరీ పరంగా ఎలాంటి థ్రెట్ లేదని నిర్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


అమెరికా- చైనా మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఈ రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే చైనా మరింత దూకుడుగా వ్యవహరించింది. ఈ సముద్రంపై ప్రయాణిస్తున్న అమెరికా నిఘా విమానాన్ని డ్రాగన్‌ ఫైటర్‌ జెట్ దాదాపు ఢీకొట్టబోయింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానం ఆర్‌సీ-135 విమానానికి అత్యంత సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకొచ్చినట్లు యూఎస్‌ మిలిటరీ వెల్లడించింది. ఈ ఘటన గురించి యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 21న దక్షిణ చైనా సముద్రంపై అమెరికా నిఘా విమానం ప్రయాణించింది. ఆ సమయంలో చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన జే-11 యుద్ధ విమానం.. అమెరికా విమానానికి ఎదురుగా 6 మీటర్ల (20 అడుగులు) దూరం వరకు దూసుకొచ్చిందని అమెరికా వెల్లడించింది.యూఎస్‌ పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి ఢీకొనే ప్రమాదాన్ని తప్పించినట్లు తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా ఈ సందర్భంగా పేర్కొంది.


Also Read: Air India Express flight: ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మంటలు, టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్