వర్షాకాలం ప్రారంభం అయి దాదాపు 30 రోజులు కావస్తోంది. వాతావరణం మారిపోయి వర్షాలు వారానికి రెండుమూడు సార్లు కురుస్తై ఉన్నాయి. అయినప్పటికీ రిజర్వాయర్లలోకి నీరు ఆశించినంతగా రాకపోవడం కాస్త కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే వర్షాలు ఈ నెల రోజుల్లో ఏ ప్రాజెక్టులోకి ఒక టీఎంసీకి మించి నీరు నిండలేదని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. జూలైలో వర్షాలు బాగా పడ్డా, కర్ణాటక లేదా మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎగువన ప్రాజెక్టులు నిండి నీటిని వదిలితే ఇక్కడ మన నీటి ప్రాజెక్టులు నిండుతాయి.
ఆయా రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో పంటలు పండాలంటే జూలై, ఆగస్టు నెలలు కీలకంగా ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల కింద కనీసం 175 టీఎంసీలు అవసరం అవుతాయని అంచనాగా ఉంది. కానీ, ప్రస్తుతం 105 టీఎంసీలే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాణహితకు ప్రవాహం రావడం, కాళేశ్వరం ఎత్తిపోతల మొదటి లిఫ్టు మేడిగడ్డ నుంచి నీటి మళ్లింపు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో గోదావరిలోని ప్రాజెక్టులకు కొంతవరకైనా ఊరట కలగనుంది.
కానీ, క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మాణం పూర్తైన, పూర్తయ్యే దశలో ఉన్న కొంత ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్న భారీ ప్రాజెక్టుల కింద 56 లక్షల ఎకరాలు ఉన్నాయని, 42 లక్షల ఎకరాల సాగుకు ప్రస్తుత వానాకాలంలో సాగునీరు ఇవ్వాల్సి ఉందని అంచనా వేశారు. వీటిలో వరి పంట, ఆరుతడి పంటలకు కలిపి జూలై, ఆగస్టు నెలల్లో అవసరమైన నీళ్ల కంటే తక్కువగా ఉన్నాయి. అందుకే ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్లడానికి నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.