Infosys Campus Expansion In Hyderabad: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో (Hyderabad) దాదాపు 35,000 మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని, ఇప్పుడున్న ఐటీ సమూహాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని జయేష్ సంగ్రాజ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
అమెజాన్ భారీ పెట్టుబడులు
అటు, తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వంతో జరగ్గా.. రాష్ట్రంలో డేటా సెంటర్లను సంస్థ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
పెట్టుబడుల సమీకరణలో సరికొత్త రికార్డు
దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది.
దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 10 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.