Mika Singh offers Rs 1 lakh reward to auto driver : గత వారం రోజుల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ ను గాయపడిన రోజు రాత్రి ధైర్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఓ స్టార్ సింగర్ ఆటో డ్రైవర్ కి భారీ రివార్డును ప్రకటించడం విశేషం.


ఆటో డ్రైవర్ కు లక్ష రివార్డు


ప్రముఖ పంజాబీ గాయకుడు వికాస్ సింగ్... సైఫ్ అలీ ఖాన్ గాయపడిన రోజు రాత్రి ఆస్పత్రికి తరలించినందుకు ఆటో డ్రైవర్ కి లక్ష రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మికా సింగ్ పోస్ట్ చేశారు. అందులో ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. "ఆటో డ్రైవర్ కి కనీసం 11 లక్షల రివార్డు అందాలని నేను కోరుకుంటున్నాను. అయితే నా వంతుగా ఆయనకు లక్ష రివార్డు ఇవ్వాలనుకుంటున్నాను. నా వైపు నుంచి ఇదొక చిన్న బహుమతి" అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. మికా సింగ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సైఫ్ అలీ ఖాన్ ను ఆరోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రానా. కొన్నాళ్లుగా ముంబైలో ఆటో డ్రైవింగ్ చేస్తున్న ఆయన ఉత్తరాఖండ్ నివాసి అని సమాచారం. ఇక ఇప్పటికే భజన్ సింగ్ చేసిన సాహసానికి ప్రశంసగా ఓ సంస్థ 11,000 నగదు బహుమతిని అందించి, సత్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై పోలీసులు డ్రైవర్ ను విచారించి డీటెయిల్స్ తీసుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో భజన్ సింగ్ మాట్లాడుతూ ఆరోజు రాత్రి తనకసలు గాయపడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని తెలియదని, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కనీసం వారి దగ్గర నుంచి ఆటో ఛార్జ్ కూడా తీసుకోలేదని వెల్లడించారు.


ఆటో డ్రైవర్ కి సైఫ్ ఆర్థిక సాయం


ఇప్పటికే తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ ను సైఫ్ అలీఖాన్ కలిసిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ఆటోడ్రైవర్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆటో డ్రైవర్ ను చూడగానే సైఫ్ అలీఖాన్ ఎమోషనల్ అవుతూ, ఆయనని హత్తుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తన వంతుగా రూ. 50 వేలను భజన్ సింగ్ కు ఆర్థిక సాయంగా సైఫ్ అలీ ఖాన్ అందించారు. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.


జనవరి 16న అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు నిందితుడు. దొంగతనం కోసం అక్కడికి వెళ్లిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం సైఫ్ పై దాడికి తెగబడ్డాడు. దీంతో అదే రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఆటో డ్రైవర్ భజన్ సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో సైఫ్ కి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 19న ముంబై పోలీసులు థానేలో దాడి చేసిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాంను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరచగా, ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.



Also Readపాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి