Telangana Latest News: తెలంగాణలో కాంగ్రెస్ తనదైన మార్కు రాజకీయాలతో ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా వ్యూహాత్మకంగా సాగుతున్న కాంగ్రెస్, ఇప్పుడు మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించింది. అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్లను రూ. 500లకే రాయితీకి అందిస్తోంది. గృహజ్యోతి పథకం పేరుతో పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మహిళలకే కేటాయిస్తోంది. ఇలా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే దిశగా పలు పథకాలను వారి పేర్ల మీద అందజేస్తోంది. అయితే ఇప్పుడు మహిళా సాధికారత పేరుతో తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తోంది. అసలు కాంగ్రెస్ మార్కు వ్యూహం ఏంటో తెలుసుకుందాం.

మహిళా సాధికారతకు పెద్దపీట: ఇందిరా మహిళా శక్తి సంబరాలు

మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ఇందిరా మహిళా శక్తి సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నిర్వహిస్తోంది. ఈ సంబరాలు జులై 12 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయడం, మహిళా స్వయం సహాయక బృందాలను (SHGలు) పటిష్టం చేయడం, ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం – ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల సాధికారతకు పెద్దపీట వేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఈ సంబరాల ద్వారా మహిళలకు కలిగే ప్రయోజనాలు ఇవే..

  • వడ్డీ లేని రుణాల పంపిణీ: ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయడం ప్రధాన కార్యక్రమం. మొదటి ఏడాది ఈ సంఘాలకు ₹21 వేల కోట్లు అందించగా, ప్రతీ ఏటా కనీసం ₹20 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా ఐదేళ్లలో ₹లక్ష కోట్ల రూపాయలను రుణాలగా మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ రుణ చెక్కులు ఈ సంబరాల్లో పంపిణీ చేస్తారు. మహిళలు తమ సొంత వ్యాపారాలు విస్తరించుకోవడానికి, లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన.

  • ఉపాధి అవకాశాల కల్పన: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు కలిగే మరో ప్రయోజనం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల యూనిఫాంల తయారీ, పాఠశాల మరమ్మతుల నిర్వహణ, క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సులను లీజుకు ఇవ్వడం వంటి ఉపాధి అవకాశాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా మహిళలను కొత్త రంగాల్లో ప్రోత్సహించినట్లు అవుతుందన్నది కాంగ్రెస్ సర్కార్ భావన.

  • సామాజిక భద్రత: మహిళా సంఘాలకు ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సదుపాయాలను కల్పించడం మరో ఉద్దేశం. రుణ సౌకర్యం తీసుకున్న మహిళా సంఘ సభ్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి ₹10 లక్షల రూపాయల బీమా వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇలా 6.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఈ సౌకర్యం కల్పించనుంది.

  • కొత్త వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడం: మహిళలను సరికొత్త వ్యాపార రంగాల్లోకి తీసుకురావడం కూడా ఈ సంబరాల్లో జరిగే మరో కొత్త కార్యక్రమం. గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి మహిళలు ఎలాంటి ప్రాజెక్టులు చేయవచ్చో చర్చిస్తారు. అందుకు ప్రణాళికలు తయారు చేస్తారు. మహిళలు వ్యాపార నైపుణ్యాలను మెరుగుపర్చుకునే దిశగా ఈ ఇందిర మహిళా శక్తి సంబరాలను ప్రభుత్వం రూపకల్పన చేసింది.

మహిళా ఓటు బ్యాంకు పటిష్టమే ఈ కార్యక్రమ రాజకీయ లక్ష్యం

అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. రేవంత్ సర్కార్ సైతం మహిళల ఓటు బ్యాంకును పటిష్టం చేసే దిశగా సాగుతోంది. ఈ ఇందిర మహిళా శక్తి సంబరాలను కూడా పకడ్బందీగా రూపకల్పన చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహాలక్ష్మి వంటి హామీల అమలు తీరును ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ మహిళకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. ఉచిత బస్సు సౌకర్యం, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి వాటిలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేయడం ఇందులో భాగం.

రుణాలు పంపిణీ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఎన్నికల్లో తాము మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మహిళలకు స్పష్టమైన సంకేతం ఇచ్చే కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ఇది పార్టీపై మహిళల్లో విశ్వసనీయత పెంచుతుందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓట్లు గణనీయంగా దక్కించుకునే దిశగా ఈ కార్యక్రమం గ్రామ, పట్టణ, నగర స్థాయిలో మంత్రంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా 68 లక్షల పైచిలుకు కుటుంబాలపై తమ పార్టీ ప్రభావం చూపుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. వీరు కూడా తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను స్థానికంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యకర్తలేనని చెబుతున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో శాసనసభ నియోజకవర్గాలు పెరిగితే 60 శాతం మంది మహిళలకే అవకాశం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. పార్టీకి కొత్త మహిళా నాయకత్వం, మహిళా క్యాడర్ ఏర్పడాలంటే ఇలాంటి కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని, ఇదే కాంగ్రెస్ మార్కు వ్యూహంగా హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, రేవంత్ సర్కార్ ఈ ఇందిర మహిళా శక్తి సంబరాలను కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం ఎంత మాత్రం కాదు; రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాత్మక సాధనం