Railway Special Trains : భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మన్మాడ్ మధ్య 126 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మాల్దా టౌన్, రేవా మధ్య 6 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో 6 ప్రత్యేక రైళ్లు నడుస్తాయిని వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్-తిరుపతి మధ్య రైలు(07509) శనివారం సాయంత్రం గం.4.35లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం గం.5.30లకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి-హైదరాబాద్ మధ్య రైలు నంబర్ 07510 మంగళవారం రాత్రి 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం గం.12.30లకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
తిరుపతికి స్పెషల్ ట్రైన్స్
రైలు నంబర్ 07511 తిరుపతి-ఔరంగాబాద్ ఆదివారం ఉదయం గం.07.05 లకు తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ స్పెషల్ మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది. ఔరంగబాద్ - తిరుపతి మధ్య రైలు నంబర్ 07512 ఔరంగబాద్ లో సోమవారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ మే 2, 9, 16, 23, 30 తేదీల్లో నడుస్తుంది. హైదరాబాద్- తిరుపతి -హైదరాబాద్ మధ్య 10 ప్రత్యేక సర్వీసులు, తిరుపతి-ఔరంగబాద్ - తిరుపతి మధ్య 10 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే నాందేడ్-విశాఖపట్నం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్-కాకినాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.