తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పార్టీ బలహీనంగా ఉందని అన్నారు. ముందు అక్కడ జన సమీకరణ ఏర్పాటు చేయాలని సూచించారు. నల్గొండ జిల్లాలో తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి కలిసి ఉన్నామని ఇక్కడ తాము పహిల్వాన్ లాగా ఉన్నామని అన్నారు. ఇక్కడ సమావేశాలు పెట్టాల్సిన అవసరం లేదని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బయట నుండి ఎవరూ రావాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.


నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన
నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి ఈ నెల 27న పర్యటించాల్సి ఉంది. అయితే, ఆ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్ పర్యటనకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. నాగార్జున సాగర్‌‌లో రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం ఖరారు అయ్యేలా చేశారు. దీంతో 28న రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌లో పర్యటించాల్సి ఉంది. తాజా పరిణామాల వేళ రేవంత్ రేపు నాగార్జున సాగర్‌లో పర్యటిస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.


పట్నం మహేందర్ రెడ్డికే కోమటిరెడ్డి మద్దతు
పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ రోహిత్ రెడ్డి వ్యవహారంపైనా కోమటిరెడ్డి స్పందించారు. ఆయన పట్నం మహేందర్ రెడ్డికే మద్దతు పలికారు. జాతర సమయంలో ఎమ్మెల్సీ అయిన పట్నం మహేందర్ కే అవమానం జరిగిందని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం, ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుందని గుర్తు చేశారు. పట్నం మహేందర్ రెడ్డి బూతులు తిట్టారు తప్పేనని.. కానీ పోలీసుల పద్ధతి కూడా మారాలని అన్నారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నా లేనట్టుగానే ఉందని విమర్శించారు.


మెడిసిన్ విద్యార్థిని దత్తతకు 
మెడిసిన్ విద్యార్థిని తాళ్లపల్లి అనూషకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమెను దత్తత తీసుకుంటున్నాని - చదువు అంతా తానే చూసుకుంటానని ప్రకటించారు. డాక్టర్ సీటు వచ్చినా, చదివే స్తోమత లేదని డబ్బుల కోసం ఉపాధిహామీ కూలీ చేసుకుంటుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో నిన్నటి ముఖ్యమంత్రి ప్రసంగం చూశానని ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోట్లు పెట్టినా దొరకని వైద్య సీటు కూలి పనిచేసుకుంటూ అనూష సీటు సాధించిందని కొనియాడారు. రాష్ట్రంలో 6 వేల స్కూళ్లు మూతపడ్డాయని, తెలుగు మీడియానికి దిక్కేలేదని అన్నారు.