Independence Day 2023 Message to People: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజకీయాలకు అతీతంగా జరగాలని దేశ ప్రజలు కోరుకుంటారు. కానీ అప్పటి రాజకీయాలకు, ఇప్పటి పాలిటిక్స్ కు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నేతలు సైతం పాలిటికల్ కామెంట్స్ చేయడానికి ఇండిపెండెన్స్ డే వేదికగా మారుతోంది. నేడు దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించుకుంటున్నాం. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ, తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన వైఎస్ జగన్, కేసీఆర్ లు పంద్రాగస్టు సందేశం- పొలిటికల్ ప్రచారంగా కనిపిస్తోంది. దేశం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుని, వారి ఆశయాలతో రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునివ్వడానికి బదులుగా, మాకు మరో ఛాన్స్ ఇవ్వండి గెలిపించండి అని ఇచ్చిన పొలిటికల్ సందేశాలు హాట్ టాపిక్ గా మారాయి.
పదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన నాలుగో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో 10 లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఎన్డీఏ ప్రభుత్వ 5 ఏళ్ల గడువు ముగియనుండగా.. వచ్చే ఆగస్టు 15న కూడా తాను జెండా ఆవిష్కరిస్తానని అన్నారు. అంటే తనకు మరోసారి అవకావం ఇవ్వాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో కోరారు. మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. వారికి దేశం అండగా ఉందని, త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుందని ఆకాంక్షించారు. రాజకీయ వేదికలపై మరోసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని, మూడోసారి ప్రధాని అవుతానని చెప్పిన మోదీ ఇండిపెండెన్స్ స్పీచ్ లోనూ పరోక్షంగా మరో ఛాన్స్ ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. అయితే వచ్చే ఏడాది మోదీ జెండా ఎగురవేసేది ఎర్రకోటపై కాదని, తన నివాసంలోనే ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున సైతం మోదీ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.
గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్ గా రాష్ట్రం ఉందన్న కేసీఆర్ తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నట్లు ప్రసంగించారు. అనంతరం రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కొందరు ఆందోళన చెందుతున్నారని.. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాయన్నారు. చివరికి ఆర్టీసీ బిల్లను ఆమోదించామంటూ గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి కనుక వచ్చే ఏడాది ఏమైనా జరగొచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉంటుందని కనుక మరో ఛాన్స్ ఇస్తే హ్యాట్రిక్ అందుకుందామని కేసీఆర్ భావిస్తున్నారు.
విజయవాడలో ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదలు గెలిచే వరకూ వారి బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తామన్నారు. 98.5 శాత0 హామీలు చేశామంటూనే ప్రతిపక్షాలకు చురకలంటించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం, వారి సహనాన్ని పరీక్షించుకోవడం అంటరానితనమే అంటూ ప్రతిపక్షాలు ఆర్5 జోన్ లో ఇళ్ల స్థలాల పంపినీ అడ్డుకునే చర్యల్ని ఈ సందర్బంగా జగన్ ఎత్తిచూపారు. తమ ప్రభుత్వానికి అవకాశమిస్తే, మరిన్ని మెరుగైన సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, నవరత్నాలు సహా ప్రస్తుతం తాము చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలంటే తాము మరో అయిదేళ్లు ప్రభుత్వంలో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలో సంక్షేమ సంతకం తీసుకొచ్చామని, హామీలు అమలు చేసే వైసీపీ సర్కార్ కు మరో ఛాన్స్ ఇస్తే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటున్నారు.