హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఆపిల్ ఎయిర్ పాడ్స్ (ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్) త్వరలో తయారు కానున్నాయి. నగరంలోని ప్లాంటు నుంచే యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారు చేయాలని కంపెనీ నిర్ణయిస్తూ అందుకు ఆమోదం తెలుపుకున్నారు. దాదాపు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ కంపెనీ సుమారు 2024 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా ఫాక్స్‌కాన్ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఫాక్స్‌కాన్ సంస్థ ఆపిల్ సంస్థకు చెందిన ఉత్పత్తులను తయారు చేసే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని పరిశ్రమలో ఆపిల్ ఐఫోన్లు తయారు అవుతున్నాయి.
మరో యాపిల్ ఉత్పత్తి అయిన ఎయిర్ పాడ్స్ ని హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఇందుకోసం ఫాక్స్‌కాన్ కంపెనీ 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు పచ్చ జెండా ఊపినట్లుగా సంస్థ వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 2024 నుంచి ఫాక్స్‌కాన్ సంస్థ హైదరాబాద్ యూనిట్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారు చేయబోతుందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
ప్రస్తుతం ఆపిల్ ఉత్పత్తుల్లో ఐఫోన్ మాత్రమే దేశీయంగా తయారు అవుతుండగా, సంస్థకు రెండో ఉత్పత్తి తయారు కావడం హైదరాబాద్ లోనే అవ్వనుంది. కొద్దిరోజుల క్రితం ఫాక్స్‌కాన్ ఇండియన్ రిప్రెసెంటేటివ్ ఒకరు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా సోషల్ మీడియాలో చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ఇది అడిషనల్ అని ఆయన చెప్పారు. మొత్తం పెట్టుబడితో ఫాక్స్‌కాన్ సంస్థ మొత్తంగా 550 మిలియన్ డాలర్లు హైదరాబాద్ ఫ్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టనుంది.