Balineni Srinivasa Reddy: 'బ్రో' సినిమా విడుదల తర్వాత ఎందుకో పోకిరి సినిమాలో 'గిల్లితే గిల్లిచ్చుకోవాలి'.. అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. తనను దొంగచాటుగా గిల్లాలని మంత్రి అంబటి, గిల్లితే ఎవరూ గిల్లిచ్చుకోరు, తిరిగి గిల్లుతారంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా పరోక్షంగా అదే డైలాగ్ కొట్టారు. ఇంతకుముందు తనపై కొందరు కుట్రలు చేశారు, తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ.. వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన బాలినేని, మరోసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన టాపిక్ తెరపైకి తెచ్చారు. ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో పోటీని ప్రస్తావించారు. 


నేను, నాతోపాటు మాగుంట..
"2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి నేనే పోటీ చేస్తాను. అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారు. కొంత మంది ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతున్నారు. వారిని, వారి మాటల్ని న‌మ్మొద్దు" అని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాలినేని అన్నారు. బాలినేని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 


మధ్యలో ఎంపీ స్థానం ఎందుకు..?
తన గురించి తాను చెప్పుకుంటే పర్లేదు. మధ్యలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పడమే ఇక్కడ బాలినేని ఇచ్చిన ట్విస్ట్. ఇటీవలే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా తప్పించారు. ఆయన ఢిల్లీలో బిజీ అవుతారని అన్నారంతా. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైవీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది. దీంతో ముందుగానే బాలినేని ట్విస్ట్ ఇచ్చారు. 


మాగుంట సంగతేంటి..?
వాస్తవానికి ఇటీవల మద్యం కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు అరెస్ట్ కావడంతో ఆయన పార్టీపై అలిగారని సమాచారం. వచ్చే దఫా ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు టీటీడీ బాధ్యతలనుంచి వైవీని తప్పించడంతో ఆయన్ను ఒంగోలు తీసుకొస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇష్టంలేని బాలినేని ముందుగానే ఓ మాటవేసి ఉంచారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం మాగుంట ఫ్యామిలీదేనన్నారు. 


తనని ఇబ్బంది పెట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహంతో ఉన్న బాలినేని, ఆయన ఒంగోలు వస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేలా లేరు. అందుకే బాలినేని ముందుగానే ఒంగోలు పార్లమెంట్ స్థానంపై ప్రకటన చేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానంపై కూడా బాలినేని అలకతో ఉన్నారు. ఇన్ చార్జ్ పదవులు తనకు వద్దని గతంలోనే తేల్చి చెప్పారు. తాను ఒంగోలు అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతానన్నారు. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతానికి బాలినేని  వైసీపీలోనే ఉన్నారు. ఉన్నారు కానీ ఇలా సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. చివరకు సీఎం జగన్, బాలినేని వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఒకవేళ మాగుంట చివరి నిమిషంలో వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరితే.. అక్కడ బాలినేనికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎంపీగా కచ్చితంగా వైవీని తీసుకొస్తారు. మాగుంట బయటకు వెళ్లకపోయినా సీఎం జగన్ తలచుకుంటే.. ఒంగోలుకి వైవీ వచ్చి తీరుతారు. ఈ రెండిటిలో ఏది జరిగినా బాలినేనికి ఇబ్బంది తప్పకపోవచ్చు. అందుకే వైవీ రావడం తనకు ఇష్టం లేదని ఆయన ముందుగానే తేల్చి చెప్పారు.