Kishan Reddy Counter : కేసీఆర్ విడుదల చేసిన వీడియోల్లో ప్రభుత్వాన్ని పడగొడతామని ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ముగ్గురితో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.  మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమిలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని.. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. 100 కోట్లు కాదు 100పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనరని ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేరని ఆరోపించారు. 


ఆ వీడియోలో ఉన్న వారితో బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి 


అసలు ఈ వీడియోలో ఉన్నవారితో బీజేపీకి సంబంధం లేదని నేను, మా పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టం చేశామని వెల్లడించారు. అయినా కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేసి దానిని వీడియో తీసుకోవటం రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు అయిన అమిత్ షా కు, జేపీ నడ్డా కు, బి ఎల్ సంతోష్ కు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు.


ఎమ్మెల్యేలను అనైతికంగా చేర్చుకున్నది కేసీఆరే 


కేసిఆర్ చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడు బైపోల్ తర్వాత కేసీఆర్లో ఆందోళన పెరిగిందన్నారు.  ఫాంహౌస్ ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నో పార్టీల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన  ఎమ్మెల్యేలను ఎంత మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారో జాబితాను కిషన్ రెడ్డి విడుదల చేశారు.


ముందు తెలంగాణలో గెలిచి జాతీయ రాజకీయాలపై మాట్లాడాలని కిషన్ రెడ్డి సలహా


బీజేపీలో ఎవరైనా చే్రాలంటే రాజీనామా చేసిన తర్వాతనే చేరారని కానీ.. టీఆర్ఎస్‌లో మాత్రం ముందుగానే చేర్చుకుని ఎవరితోనూ రాజీనామా  చేయించలేదన్నారు. పైగా వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు.  ఈ మధ్యకాలంలో కేసీఆర్ నోరు తెరిస్తే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి, ముందు రాష్ట్రాన్ని బాగు చేసి ఆ తర్వాత దేశం గురించి ఆలోచించాలన్నారు.