Gujarat Elections 2022:


రాహుల్ పర్యటన..


గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించాక అక్కడి రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి. భాజపాను గద్దె దించేందుకు కాంగ్రెస్, ఆప్ శక్తి మేర కృషి చేస్తున్నాయి. ప్రచారంలోనూ వ్యూహాలు మార్చి దూకుడు పెంచుతున్నాయి. ఆప్ ఇప్పటికే..ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరే ఎన్నుకోండి అంటూ ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. చాలా రోజుల మేధోమథనం తరవాత ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనుంది ఆమ్‌ఆద్మీ పార్టీ. 
అటు కాంగ్రెస్‌ కూడా గుజరాత్‌లో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ...గుజరాత్ పర్యటనకు వస్తున్నారు. ఇక భాజపా అయితే అలుపెరగకుండా ర్యాలీలు, మీటింగ్‌లు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మమేకమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజార్చుకోకూడదన్న పట్టుదలతో ఉంది. అయితే...ఈ మూడు పార్టీల్లో కాస్త దూకుడుగా ఉన్నది ఆమ్‌ ఆద్మీ పార్టీయే. అలా ఎన్నికల తేదీలు ప్రకటించారో లేదో వెంటనే ఆప్ ప్రచార వ్యూహాలను మార్చుకుంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 8వ తేదీ వరకూ గుజరాత్‌లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. అంతకు ముందే గుజరాతీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలిచ్చిన ఆయన..మరో నాలుగు రోజుల పాటు ప్రచార వేగాన్ని పెంచనున్నారు. 11 రోడ్‌షోలు నిర్వహించేందుకు ఆప్ రెడీ అవుతోంది. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పూర్తి స్థాయిలో గుజరాత్‌లోనే ఉండనున్నారు. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ రాష్ట్రంలో ఎలాంటి ర్యాలీ నిర్వహించలేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ దీనిపై ఎలాంటి అధికారిక సమాచార ఇవ్వకపోయినా...నేటి నుంచే ప్రచారం మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. 


కేజ్రీవాల్ హిందుత్వ కార్డ్..


ఇక భాజపా విషయానికొస్తే...స్వయంగా ప్రధాని మోదీ గుజరాత్‌లో తరచూ పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. హోం మంత్రి అమిత్‌ షా కూడా తరచూ గుజరాత్‌లో పర్యటించారు. అమిత్‌ షా నేతృత్వంలో గుజరాత్ ఎన్నికల వ్యూహాలు ఖరారు చేసుకునే సమావేశాలు జరుగు తున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించే ఓ రోజు ముందే సీఎం భూపేంద్ర పటేల్ అమిత్‌షాను కలిశారు. అయితే...ఆప్ ఇచ్చిన హామీలు ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ భాజపా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఎప్పుడూ లేనంతగా హిందుత్వ కార్డ్‌నీ తెరపైకి తీసుకొచ్చారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది. డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది. గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.


Also Read: Gujarat Assembly Election 2022: బీజేపీని వెంటాడుతున్న టెన్షన్ అదే, ఈ సారి గెలుపు అంత సులభం కాదు!