Hevay Rains In Telangana on April 7th And 8th: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు గురువారం వెల్లడించారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. గంటకు 30 నుంచి 4 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏప్రిల్ 10న కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.
భానుడి ఉగ్రరూపం
మరోవైపు, తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా నిడమానూరులో గురువారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాష్ట్రంలో ఈ సమ్మర్ సీజన్ లో ఫస్ట్ టైమ్ 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఎన్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.