Heavy Rains In Telangana: హాట్ సమ్మర్ లో తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆగ్నేయ దిశగా గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నట్లు వెల్లడించారు.


అలాగే, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, సూర్యాపేటతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.


తడిసి ముద్దయిన ధాన్యం


భారీ వర్షంతో కొన్ని చోట్ల ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అటు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షంతో.. ధాన్యం కుప్పలు తడిసిపోగా రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, రోడ్లపై పారుతోన్న వరదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


హైదరాబాద్ లోనూ భారీ వర్షం


భాగ్యనగరంలోనూ ఒక్కసారిగా వాతావరణ మారి భారీ వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి వరకూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్, మూసాపేట, కూకట్పల్లి, మాధాపూర్, ఎల్బీనగర్, మియాపూర్, దిల్ షుఖ్ నగర్, చంపాపేట్, నాగోల్, చైతన్యపురి,సైదాబాద్, సంతోష్ నగర్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అలాగే, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, ఫిలింనగర్, మణికొండ, షేక్ పేట్, గచ్చిబౌలి,  కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, కుత్బుల్లాపూర్‌, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారాం, సూరారం, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ - డీఆర్ఎఫ్ సహాయం కోసం 040 - 21111111 కు లేదా 9000113667కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో రాబోయే 2 గంటలు, రాత్రి వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.