Telangana Weather Latest Update: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మరో మూడు గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐఎండీ అధికారులు సంబంధిత వాతావరణ అంచనాల నివేదికను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తాజాగా (జూన్ 10 మధ్యాహ్నం 12 గంటలకు చేసిన ట్వీట్) ట్విటర్ ద్వారా వెల్లడించింది.
మూడు రోజులుగా హైదరాబాద్‌లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజుల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మాన్ సూన్ టీమ్‌లు, విపత్తు స్పందక టీమ్‌లను అప్రమత్తం చేశారు.
హైదరాబాదీలకు తలసాని కీలక సూచన
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక సూచన చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైద్రాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు GHMC అధికారుల సహాయం కోసం 040 - 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని చెప్పారు.
కార్పొరేటర్ లు తమ డివిజన్ లలో పర్యటించాలని, అక్కడి పరిస్థితులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని నిర్దేశించారు. నాలాలు, బ్రిడ్జిలు, చెరువుల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.