IMD Alert On Hailstorms In Telugu States: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో వేసవి ప్రారంభం నుంచి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లోని వడగాల్పులు అధికంగా ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకూ సాధారణం కంటే అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్ నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయని చెప్పారు. ఈ క్రమంలో పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే వరకూ ఎండలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. మార్చిలో తెలుగు రాష్ట్రాలు సహా ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. మార్చి నుంచి మే వరకూ అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని.. అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం అధికంగా ఉంటాయని తెలిపింది. అటు, అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ నాటికి లానినా మొదలవుతుందని అంచనా వేసింది. ఇక, నైరుతి రుతు పవనాల సీజన్ రెండో భాగం అంటే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.


Also Read: CM Revanth Reddy: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు - ఆ ఫైలుపై నిమిషంలో సంతకం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి