ప్రస్తుతం విపరీతంగా జనాల్లో కనిపిస్తున్న జ్వరాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హై అలర్ట్ జారీ చేసింది. ఎంతో మంది జ్వరాలు, జలుబులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. వైరల్ ఫీవర్ అధిక పేషెంట్లలో కనిపిస్తోంది. చాలా మందిలో అది తీవ్రంగా.. దీర్ఘకాలికంగా కూడా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే హై అలర్ట్ జారీ చేశారు. మామూలు ఫ్లూ తరహాలో కాకుండా, దేశంలో కొత్త ఫ్లూ విజృంభిస్తోందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ వైరస్‌ల కారణంగానే..
ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తుండగా, దీనికి కారణం Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ వైరల్ జ్వరాలు కొందరిలో జ్వరం తర్వాత న్యూమోనియాగా మారుతున్నాయని, శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది.
వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరింది. డాక్టర్లను కన్సల్ట్ అవ్వకుండా యాంటీ బయోటిక్స్ మందులు వాడకూడదని ప్రజలకు సూచించింది. మరోవైపు శరీరంలోకి సోకిన ఇన్‌ఫెక్షన్‌లు కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.