Minsiter KTR With ABP Desam : ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.." ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ను మాకు పరిచయం చేశారు. వాళ్లు టీఆర్ఎస్ తరఫున పనిచేసేందుకు ఒప్పుకున్నారు. ఎవరూ ఓడిపోయే పార్టీలకు సపోర్టు ఇవ్వరు. ఐప్యాక్ కూడా అంతే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తోందన్న నమ్మకంతో ఐప్యాక్ మాతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకుంది. మమత, స్టాలిన్, నవీన్ పట్నాయక్ ఇలా ఎక్కడ మంచి లీడర్లు ఉన్నారో అక్కడ ఐప్యాక్ సక్సెస్ అయింది." అని కేటీఆర్ అన్నారు.
ఖమ్మం ఘటనకు బీజేపీ బాధ్యత వహించాలి
"రామాయంపేట తల్లి, కుమారుడు ఆత్మహత్య ఘటన విషాదకరం, దురదృష్టకరం. జరగకూడని ఘటన. అయితే ఆ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు చూడండి. లఖింపూర్ ఘటన తర్వాత బీజేపీ ఏం చేసిందో చూడండి. మరి టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిందితుడిని రామాయంపేటలో అరెస్టు చేశారు. విచారణ జరగనివ్వండి. టీఆర్ఎస్ నేత నేరానికి పాల్పడినట్లయితే, అభియోగాలను ఎదుర్కొనేలా మేము చేస్తాం. ఖమ్మం బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మంత్రిగా నేను అధికారిక పనులకు వెళ్లినప్పుడు, నా వాహన శ్రేణిని అడ్డుకోవాలని బీజేపీ యువ నాయకులను ప్రేరేపించింది. ఈ ఘటనకు సంబంధించి సహజంగానే పోలీసులు కేసులు పెడతారు. అలాంటి ఓ ఘటనలో కేసు నమోదు అయింది. సాయి గణేష్ ఆత్మహత్యకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి." అని మంత్రి కేటీఆర్ అన్నారు.
గవర్నర్ రాజకీయ ప్రసంగాలు
"గాంధీని హత్యచేసిన వారిని ప్రధాని మౌనంగా సమర్థిస్తారని నా దృఢమైన అభిప్రాయం. నాథూరామ్ గాడ్సే మొదటి ఉగ్రవాది అని నేను అంటాను. గాడ్సే జయంతిని జరుపుకునేటప్పుడు ప్రధాని నోరు మెదపరు. అంటే గాడ్సేను సమర్థించడం కాదా. గవర్నర్ అనేది నామమాత్రపు పదవి. ఆమెను ప్రత్యక్ష్యంగా ఎన్నుకోలేదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయేతర వ్యక్తులను గవర్నర్‌గా నియమించండి అని మోదీ స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన మాటలను పాటించడం లేదు. రాజకీయ నాయకురాలిలా గవర్నర్ ప్రసంగాలు చేస్తారు కానీ మనం మాట్లాడితే తప్పు. బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు చేస్తోంది. టీఆర్ఎస్ హలాల్, హిజాబ్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఉపాధి సమస్యలు, సామాన్యులకు బలం చేకూర్చే అంశాలపై చర్చించాలనుకుంటుంది. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో మూడోసారి ఎన్నికల్లో గెలుపొందేందుకు రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తాం. ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకుంటాం. ఎన్‌డీఎ ప్రభుత్వంపై నా ఆరోపణ ఏమిటంటే అవి ఎన్‌పీపీ అంటే నాన్ పర్ఫామింగ్ అలెయెన్స్( పని చేయని కూటమి). బండి సంజయ్ ఒక బఫూన్, జోకర్. అతనికి అవగాహన లేదు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోకపోతే తెలంగాణ బీజేపీ ఎక్కడ, బండి ఎక్కడ." అని కేటీఆర్ అన్నారు.