Minister Gudivada Amarnath : పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తామంటూ ఆయన యాత్ర చేస్తున్నారని, కానీ ఆ 40 కుటుంబాలలో ఇప్పటికే 8 కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసిందన్నారు. అయితే అసలు రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు మొదలయ్యాయన్నది పవన్‌కల్యాణ్‌ ఆలోచించాలన్నారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు ఉన్న రూ.87 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత మాట తప్పారన్నారు. అప్పుడు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పవన్ రైతుల మరణాల గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.


రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు అవహేళన చేశారు


గతంలో రైతుల ఆత్మహత్యల గురించి చంద్రబాబు చాలా అవహేళనగా మాట్లాడారని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రైతులు మద్యంతో చనిపోతున్నారని చెప్పారన్నారు. కానీ వాస్తవానికి చంద్రబాబును నమ్మిన రైతులు, ఆ తర్వాత ఆయన మాట తప్పడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు. అప్పటి ప్రభుత్వం కలిసి ఉన్న పవన్‌ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ దత్తపుత్రుడు అనడానికి ఇంతకన్నా ఏం కావాలన్నారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌ ఇవాళ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆరోజు రైతు మరణాలకు కారణమైన చంద్రబాబును సమర్థించి, ఇవాళ అదే రైతు కుటుంబాల పరామర్శ అని తిరుగుతున్నారన్నారు. 


పవన్ పార్టీ చంద్రబాబు కోసమే 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఇస్తుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. 52 లక్షలకు పైగా రైతులకు ఆ సాయం అందిందన్నారు. రైతులకు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు అడుగడుగునా అండగా నిలుస్తూ 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నామని గుర్తుచేశారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నామని తెలిపారు. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా అన్ని పథకాలు వర్తింపచేస్తున్నామన్నారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు ద్వారా ఏర్పడిందే పవన్‌ పార్టీ అని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం తప్ప ఆ పార్టీ ఎవరి కోసం పని చేస్తుందన్నది అన్నది పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. 


"కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ప్రచారం చేశారు. ఇక నలుగురిని పెళ్లి చేసుకున్న పవన్‌ కల్యాణ్‌కు వ్యక్తిత్వం లేదు. మంచి క్యారెక్టర్‌ అస్సలే లేదు. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ మా ప్రభుత్వంపైనా, సీఎం పైనా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇద్దరూ నైతిక విలువలు లేని వారే. ఒకరేమో తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు. మరొకరు నలుగురిని పెళ్లి చేసుకున్న, ఏ మాత్రం నైతికత. విలువలు లేని వ్యక్తి." మంత్రి అమర్నాథ్ తెలిపారు. 


చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారు


జగన్‌ కు ఏ కేసుల్లో శిక్ష పడలేదని మంత్రి అన్నారు. జగన్‌ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. అందుకే ఒక్క కేసు కూడా ఆయనను ముద్దాయిగా తేల్చలేదన్నారు. ఆయనపై పెట్టిన కేసులు తప్పు అని ప్రజలకు కూడా తెలుసు కాబట్టే, 2014లో కాంగ్రెస్‌ పార్టీని, ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తుడిచిపెట్టారన్నారు. ప్యాకేజీ స్టార్‌గా చంద్రబాబు ఏం చెబితే అది పవన్ చేస్తారని మంత్రి విమర్శించారు. ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోతారని, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారని అదే ఆయన రాజకీయం అన్నారు. చంద్రబాబు చివరకు సొంత కుమారుణ్ని నమ్మకుండా దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నాడన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలని, చంద్రబాబు విపక్షంలో ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నది పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమన్నారు. అందుకే ఆయనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నామన్నారు.