Vijayamma Press Meet: కొట్టాలంటే ఇంకా గట్టిగా కొట్టొచ్చు, మాకు ఆ ఉద్దేశం లేదు - విజయమ్మ

లోటస్ పాండ్‌లోని తన నివాసంలో వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడారు. ఇది అసమర్థ ప్రభుత్వం అని కొట్టిపారేశారు.

Continues below advertisement

వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం, పోలీసులపై చేయి చేసుకున్న దృశ్యాలు మీడియాలో పదే పదే ప్రసారం అవుతుండడంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో విజయమ్మ సోమవారం (ఏప్రిల్ 24) మీడియాతో మాట్లాడారు. ఇది అసమర్థ ప్రభుత్వం అని కొట్టిపారేశారు. ఎప్పుడు చూసినా తమ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారని, షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా అని ప్రశ్నించారు.

Continues below advertisement

వైఎస్ షర్మిల డ్రైవర్ ను కొట్టారు. గన్ మెన్లను లాగేశారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. ఆ ఆవేశంలో షర్మిల, నేను చెయ్యి అలా అన్నాము. మీడియాలో పదే పదే అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగా అయినా కొట్టొచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలకు లేదు, నాకూ లేదు- విజయమ్మ

‘‘న్యాయంగా ప్రశ్నిస్తున్న గొంతును ఎంత కాలం అణచివేస్తారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాలు దానికి సొల్యుషన్ చూపించాలి. బలం ఉందని చెప్పి పది మంది పోలీసులు ఆడబిడ్డపైన దౌర్జన్యం చూపారు. అందరూ మీద పడుతుంటే ఆవేశం రాదా? ప్రశ్నించే గొంతును ఆపేస్తారా? మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా.. దయచేసి మీడియాలో సరిగ్గా చూపించండి. ప్రజల కోసం మీడియా కూడా పోరాడాలి. నేను, షర్మిల పోలీసులను కొట్టామని అవే దృశ్యాలు తిప్పి తిప్పి చూపించడం సరికాదు. ఈ ధోరణిని మీడియా, పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నా’’

షర్మిల సిట్ ఆఫీసుకు వెళ్తుంటే ఎందుకు ఆపాలి? షర్మిల ఒక్కరే వెళ్తున్నారు. జనం కూడా లేరు. ఆపాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం కూడా స్పోర్టివ్ గా తీసుకోవాలి గానీ, అణచివేయడం మంచిది కాదు’’ అని వైఎస్ విజయమ్మ అన్నారు.

పోలీసుల వద్ద సమాధానం లేదు - విజయమ్మ

‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి వైయస్ షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంత కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతిసారి హౌజ్ అరెస్టులతో అణచివేస్తున్నారు. ఒంటరిగా సిట్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అరెస్టులు ఎందుకు చేయాలి. గ్రూప్స్ పరీక్ష పేపర్లు, పదో తరగతి పేపర్లు లీక్ అయ్యాయి. దీనిపై ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తేనే తప్పా? స్టేషన్ లో నా కూతుర్ని చూసి పోతానంటున్నా పోలీసులు అనుమతించట్లేదు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను అడిగితే సమాధానం లేదు’’

వైఎస్ షర్మిల మాత్రమే మొట్టమొదటగా నిరుద్యోగుల సమస్యలపై  పోరాటం చేసింది. ప్రజల తరఫున ఏ పోరాటం చేసినా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎందుకు షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ఒక మహిళపై కనీస గౌరవం లేకుండా అంతమంది పోలీసులు పైన పడుతుంటే ఆవేశం రాదా? పది మంది మహిళా పోలీసులు నాపై పడుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నన్ను కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది. -

కోర్టుకు వెళ్తాం - విజయమ్మ

వైఎస్ షర్మిల ప్రజల కోసం పోరాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాకారం చేయడానికి కష్టపడుతోంది. ఒక మహిళ 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందంటే ప్రజలు ఆలోచించాలి. ప్రతిపక్షాలు ప్రశ్నించిన వాటికి పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటి? ఇలా ఎన్ని సార్లు పోలీసులు అరెస్టులు చేస్తారు. అసమర్థతను పక్కనపెట్టి.. నియంత పాలన వదిలి ప్రజల కోసం పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంపై కోర్డుకు వెళ్తాం’’ అని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: పోలీసుల చెంపపై కొట్టిన విజయమ్మ, మీకు చేతనైంది అదొక్కటేనని ఫైర్ - పీఎస్ ముందే నిరసన

Continues below advertisement