వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేఖ రాశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల అంశంపై తాను కల్వకుంట్ల కవిత నుంచి నిన్న (సెప్టెంబరు 5) లేఖ అందుకున్నానని తెలిపారు. రిజర్వేషన్ బిల్లు విషయంలో పార్లమెంటులో మద్దతు కోరుతూ ఆ లేఖ ఉందని తెలిపారు.
దీనికి కౌంటర్ గా షర్మిల కవితకు లేఖ రాశారు. కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీలోనే మహిళలకు కేవలం 5 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. సాక్షాత్తూ తన తండ్రి సీఎం అని అలాంటి చోటనే ఇంత తేడా ఎందుకు ఉందని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే ప్రాతినిథ్యం వహించారని, 2018 ఎన్నికలప్పుడు కేవలం నలుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత ముందు ఇక్కడ మహిళల ప్రాతినిథ్యం పెంచేలా తన తండ్రిని ఒప్పించాలని సూచించారు. తర్వాత మహిళా ప్రాతినిథ్యం విషయంలో దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని సూచించారు. ‘‘మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5 శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదు. నా అభిప్రాయంతో పాటు, ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా కూడా పంపుతున్నా. జాబితాతో పాటు ఒక కాలిక్యులేటర్ లింక్ కూడా పంపిస్తున్నా. బీఆర్‌ఎస్ జాబితా చూసి 33 శాతం ఇచ్చారా? లేదా? లెక్కబెట్టండి. మహిళా ప్రాతినిథ్య బిల్లుకు మద్దతు కూడగట్టే ముందు మీ తండ్రితో ఈ విషయం గురించి చర్చ చేయాలని మనవి’’ అంటూ వైఎస్ షర్మిల లేఖలో వివరించారు.