హైదరాబాద్‌లో సరోగసి పేరుతో జరుగుతున్న అక్రమాలు మరోసారి వెలుగుచూశాయి. ఇక్కడ ఎప్పటి నుంచో అద్దె గర్భాల వ్యాపారం జరుగుతోంది. కేంద్రం నిషేధించినా అక్రమార్కులు.. సరోగసిని వ్యాపారాన్ని వదలడంలేదు. రాబడి వీపరీతం ఉంటుందని కనుక.. కాబట్టి గుట్టు చప్పుడుకాకుండా అద్దె గర్భధారణ అరేంజ్ చేస్తున్నాయి. ఇందులో ఎక్కువగా పేద మహిళలే టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బు ఇస్తామని ఆశ చూపి వారిని... సరోగసీకి ఒప్పిస్తున్నట్టు తేలింది.


ఈ ఏడాది మార్చికి సంబంధించి డేటా పరిశీలిస్తే.. హైదరాబాద్‌ నుంచి 21 సరోగసీ దరఖాస్తు దాఖలైతే.. ఇందులో ఐదు అక్రమమని అధికారులు తేల్చారు. ఐదు దరఖాస్తులను తిరస్కరించారు. ఆ ఐదుగురు మహిళలను వ్యాపారం కోసమే తీసుకొచ్చినట్టు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లో సరోగసి వ్యాపారం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా మంది అద్దె తల్లులను.. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తోపాటు నేపాల్ నుంచి కూడా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో అద్దె గర్భం కోసం నాలుగు లక్షల రూపాయల వరకు చెల్లించారని తెలుస్తోంది. 


సరోగసి కోసం అవసరమైన అర్హత సర్టిఫికేట్లు ఇచ్చేందుకు సంబంధిత అధికారలు.. సరోగసి తల్లులతోపాటు... వారి ద్వారా పిల్లలను పొందబోతున్న జంటలను కూడా పర్సనల్‌గా ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఆ సందర్భంగా... వారికి అంతా సజావుగా ఉందనిపిస్తేనే సరోగసికి అనుమతి ఇస్తారు. లేదంటే.. అనుమతి ఇవ్వరు. ఇటీవలి సరోగసికి ఒప్పుకున్న కొందరు మహిళను అధికారులు ప్రశ్నించారు. వారిలో ఒకరిని ఢిల్లీ నుంచి, ఇంకొకరిని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన్నట్టు గుర్తించారు. వారిని పరోపకార అద్దె గర్భం కోసం కాదని... డబ్బు ఆశచూపి సరోగసి పేరుతో వ్యాపారం కోసమే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. సరోగేట్ తల్లి వివరాలు, మ్యారిటల్‌ స్టేటస్‌కు సంబంధించిన అంశాల్లో పొంతన లేదని తేల్చారు. అద్దె తల్లులకు ఇప్పటికే వారి పిల్లలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. సరోగసి పేరుతో వ్యాపారం కోసమే వారిని తీసుకొచ్చినట్టు ధృవీకరించారు. 


ఎంత డబ్బు అయినా పోసి... అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో... సరోగసి ఈ వ్యాపారం కూడా జోరుగా సాగుతోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అద్దె గర్భాల కోసం వస్తున్నది ఎక్కువగా NRI జంటలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే అని అధికారులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలతో పిల్లలు పుట్టని జంటల కన్నా... పిల్లలను కంటే అందం తగ్గిపోతుందనుకునే వాళ్లే ఎక్కువగా సరోగసి వైపు మొగ్గు చూపుతున్నారని.. పిల్లల కోసం లక్షల రూపాయాలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇలాంటి వారి కోసం పేద మహిళలను డబ్బు ఆశ చూపి ఈ వ్యాపారంలోకి దింపుతున్నారన్నది వాస్తవమంటున్నారు. చట్టవిరుద్ధమైన సరోగసి విధానాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న సరోగసి దందాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ.. పైస్థాయి నుంచి సరోగసి పేరుతో జరుగుతున్న దందాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.