ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లిన షర్మిల మందకృష్ణ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. సెప్టెంబరు 12న తాను నిర్వహించే దళిత భేరి బహిరంగ సభకు హాజరు కావాలని మందకృష్ణను షర్మిల ఆహ్వానించారు.


‘‘ఎమ్మార్పీఎస్ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన‌ నివాసంలో కలిసి ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది. ఆయన  ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను. అలాగే సెప్టెంబరు 12న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే ‘‘ద‌ళిత భేరి’’ బహిరంగ స‌భ‌కు ఆయన్ను ఆహ్వానించాను.’’ అని షర్మిల ట్వీట్ చేశారు.






జారి పడ్డ మందకృష్ణ
ఎమ్మార్పీఎస్‌ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌ కృష్ణ మాదిగ ఇటీవ‌ల‌ తన ఇంట్లోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో ఆయనకు కాలి ఎముక విరిగింది. ఫలితంగా అనంత‌రం ఆయ‌న కొద్దిరోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌నను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల బుధవారం క‌లిశారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. దళితుల పక్షాన తాను చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ షర్మిలను కోరారు.


వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ ఈ నెల 12న ‘వైఎస్‌ఆర్‌ దళిత భేరి’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను సోమన్న శుక్రవారం లోట్‌సపాండ్‌లో ఆవిష్కరించారు. దళిత భేరి బహిరంగ సభకు వైఎస్ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు.