వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ వారు పాలించటానికి అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను తెలంగాణలో రాజకీయాలు చేయవద్దని చెప్పటానికి ఆయనెవరని నిలదీశారు. తాను ఆంధ్ర వ్యక్తి అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడి వారని ప్రశ్నించారు. ఆమెది ఇటలీ కదా అని అన్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ అని అన్నారు. ఈ గడ్డపైన జై తెలంగాణ అనే దమ్ము తనకు మాత్రమే ఉందని సమర్థించుకున్నారు. రేవంత్ రెడ్డి అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని షర్మిల మాట్లాడారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడ్ని కూడా ఆంధ్రా నుంచి తెచ్చుకోలేదా అని నిలదీశారు. ముందు ఆ సంగతి ఏంటో రేవంత్ రెడ్డి చూడాలని షర్మిల వ్యాఖ్యానించారు.

ఒక ప్రాంతాన్ని వదిలేసి, సొంత వాళ్ళను కాదనుకొని, పెళ్లి తర్వాత బిడ్డలను కనీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అని అన్నారు. ఇది మన దేశ సంస్కృతి, గొప్పతనమని, ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలని అన్నారు. ఆ సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అభద్రతతో మాట్లాడుతున్నారని, తన వల్ల ఆయన ఉనికి ఎక్కడ పోతుందో అని భయంగా ఉందనుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ.. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ టీపీ అని అన్నారు. జై తెలంగాణ అనే హక్కు కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోదీ, సోనియా గాంధీ తదితరులకు లేదని అన్నారు.