బీఆర్ఎస్ పార్టీపై ఎప్పుడూ ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉంటారు వైఎస్ షర్మిల. తాజాగా కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపైన కూడా షర్మిల స్పందించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వనమా వెంకటేశ్వరరావు లాంటివారేనని షర్మిల ఎద్దేవా చేశారు. వారు అందరూ ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్లే అని, దొరల్లా చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి YSR తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందని షర్మిల ట్వీట్ చేశారు.






‘‘BRS లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే.అంతా ఎన్నికల కమీషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లే. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం.అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి YSR తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నాం’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.


ఇటీవలే షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ లేదన్నారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తొలిసారి ఉద్యమ సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. మూడోసారి గెలిచే ఛాన్సే లేదని, దమ్ముంటే సిట్టింగులకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్ విసిరారు.  ఇన్నాళ్లు దొరగారు దర్జాగా గడీల్లో ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు అని ఆరోపించారు. 


ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. తన కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్ లో కూర్చుంటే ఎమ్మెల్యేలు కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని పదే పదే ప్రస్తావించారు. నేతల అవినీతిని ప్రశ్నించిన వారిని చితకబాదారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కేసీఆర్ కు అర్థమైందన్నారు షర్మిల. అందుకే సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 


సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే... సర్వేలు ఎందుకు చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జనం ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర ఉలిక్కిపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప ఎన్నికల్లో గట్టెక్కలేనని తెలుసుకున్నారు కేసీఆర్.  మీది అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఉంటే..  ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. మీరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుద్ధపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయాలని వైఎస్సార్ టీపీ డిమాండ్ చేసింది.