YS Bhaskar Reddy treated as Special Category Prisoner -హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్టు అయ్యారు. హత్య కోసం వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు.  
Also Read: Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు


వివేక హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట!
వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు ఇరు పక్షాల వాదలను విన్న తెలంగాణ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై పది రోజుల నుంచి హైడ్రామా నడుస్తోంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన అవినాష్‌ ముందస్తు బెయిల్ కోసం పోరాడారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సీబీఐ దీనిపై ఏం చేస్తుందో చూడాలి. 


ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు పెట్టిన షరతులు
ప్రతి శనివారం సీబీఐ విచారణ హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించింది. ఐదు లక్షల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో
సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదు అని పేర్కొంది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి హైకోర్టు సూచించింది.