YouTuber Chandu Sai Arrest: పక్కింటి కుర్రాడు, చందూగాడు యూట్యూబ్ ఛానెళ్లలో వీడియోలు చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ చందు సాయి (చంద్రశేఖర్ సాయి కిరణ్) అరెస్టు అయ్యారు. ఆయన ఓ యువతిని అత్యాచారం చేశారని, మోసం చేశారని కేసు నమోదు అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నార్సింగి పోలీసులు చందూ సాయిని శుక్రవారం (డిసెంబర్ 15) అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన ఓ యువతికి యూట్యూబర్ చందుసాయి తాను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. అలా 2021 ఏప్రిల్ 25న తన పుట్టిన రోజు వేడుకలకు ఆమెను ఆహ్వానించాడు. అదే రోజు తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
కొద్ది రోజులకు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతను నిరాకరించాడని యువతి ఆరోపించింది. ఎన్నిసార్లు అడిగినా ముఖం చాటేస్తుండడంతో అతడి చేతిలో మోసపోయానని గ్రహించినట్లు యువతి తెలిపింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లుగా బాధితురాలు వెల్లడించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు పెట్టారు. చందూ సాయితో పాటు అతని తల్లిదండ్రులు సహా ఇంకో ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చంద్రశేఖర్ సాయి కిరణ్.. యూట్యూబ్‌లో పక్కింటి కుర్రాడు, చందుగాడు పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ఛానల్స్‌లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరు బాగా సంపాదించాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. నాన్నతో మిర్జాపూర్, లిప్ లాక్, లివ్-ఇన్ గొడవలు, వర్జిన్ కష్టాలు, నాన్నతో అర్జు్న్ రెడ్డి తదితర వీడియోలకు ఆయన ఛానెల్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి.