Yadav Community Protest: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కించపరిచారని యాదవ కులస్థులు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చేప్పాలంటూ నిరసనలు చేపట్టారు. అక్కడి నుండి దున్నపోతులతో ర్యాలీ నిర్వహించి గాంధీ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు. ఆందోళనకారులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.


అంతకుముందు జరిగిన మహాధర్నాలో పాల్గొన్న యాదవ జేఏసీ నేతలు కడారి అంజయ్యా యాదవ్, కో-కన్వీనర్ కోసుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బేషరతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, గొల్ల కురుమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా, రేవంత్ రెడ్డి వైఖరా అనేది స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.


'ఎవరినీ కించపరచలేదు'


తలసాని- రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధంలో ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ రెడ్డి తలసానిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడారని, ముందు తలసాని దూషించిన తర్వాతే రేవంత్ రెడ్డి స్పందించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్లకురుమలు డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యాదవులకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా యాదవుడనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. తలాసని తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల తలెత్తిన వివాదమని, దానిని కులానికి సంబంధం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.


Also Read: గవర్నర్లు కూడా రాష్ట్రపతిలాంటి వ్యక్తులే కదా- తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై చురకలు


మాటల లొల్లి ఆరోజు ప్రారంభమైంది


కాంగ్రెస్ యువ సంఘర్షణ‌ సభలో ప్రియాంక గాంధీ యూత్‌ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. రేవంత్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ... వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు.. పిసికితే పాణం పోతది’’ అని పరోక్షంగా రేవంత్ ‌రెడ్డిన ఉద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో.. రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడే వాళ్ళేనా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే, ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని, అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు.                                        


కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా, కేటీఆర్ సంక నాకినా ఈ స్థాయికి రాలేరని ఎద్దేవా చేశారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.


రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదవ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ గొల్లకురుమలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.