GHMC asks Telangana Government To Ban Egg Mayonnaise | హైదరాబాద్: ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ తిని చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో అలాంటి ఘటనే జరిగింది. మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందడం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. మోమోస్ తిన్న మరో 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
నగరంలోని నందినగర్, సింగాడకుంట బస్తీకి చెందిన గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం సంత జరిగింది. ఈ సంతలో విక్రయించిన మోమోస్ ను స్థానిక సింగాడకుంట బస్తీకి చెందిన పలువురు తిన్నారు. అదేరోజు రాత్రి నుంచి వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. మోమోస్ తిని తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని నగరంలోని పలు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. రేష్మ బేగం (31) పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. మోమోస్ తిన్న వారిలో పది మంది వరకు మైనర్లు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
మోమోస్ తిని అస్వస్థతకు గురైన ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శుక్రవారం రోజు సంతలో మోమోస్ విక్రయించిన ఇద్దరు చిరువ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోమోస్ బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. అయితే మోమోస్ తో ఇచ్చే మిర్చి చట్నీ, మయోనైజ్ కలుషితం, అపరిశుభ్రమైనది ఇవ్వడం వల్లే తిన్నవారు అస్వస్థతకు గురై ఉండొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇటీవల షవర్మ తిని పలువురికి అస్వస్థత
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నా ఆహార కల్తీ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో షవర్మా తిన్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు, కొందరు విరేచనాలు కావడంతో హాస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మరోచోట సైతం ఇలాంటి ఘటనే జరిగింది. అల్వాల్ లోని ఓ హోటల్‌లో షవర్మా తిన్న కొందరు అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. వారు తిన్న ఆహారంలో ప్రమాదరకర బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షలు చేసిన డాక్టర్లు తెలిపారు. షవర్మ తినేందుకు వినియోగించే మయోనైజ్ కలుషితం కావడం, నాసిరకంగా ఉండటంతో తిన్నవారు అస్వస్థతకు లోనయ్యారని గుర్తించారు.
మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ సలహా
ఇటీవల చిరుతిండ్లు తిన్నాక నగర ప్రజలు అస్వస్థతకు గురవుతుదన్నారని.. అందుకు మయోనైజ్ అనే పదార్థం కారమని దాన్ని నిషేధించాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. గుడ్డుతో తయారుచేసే ఈ పదార్థం కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ప్రభుత్వానికి అధికారులు తెలిపారు.