Woman Constable: ఫోన్ తీసుకొని పదో తరగతి పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లబోతున్న రాచకొండ సీపీ చౌహాన్ ను అక్కడే డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆపింది. ఫోన్ తో లోపలికి వెళ్లవద్దని ఆయనకు సూచించింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఓ పదో తరగతి పరీక్షా కేంద్రంలో తనిఖీకి వెళ్లిన సీపీని.. మహిళా కానిస్టేబుల్ ఆపింది. ఫోన్ ఇక్కడే డిపాజిట్ చేయాలని కోరింది. ఇందుకు ఒప్పుకున్న సీపీ చౌహాన్ తన మొబైల్ ఫోన్ ను వాళ్లకు ఇచ్చి లోపలికి వెళ్లాడు.


తన పై అధికారి అని కూడా చూడకుండా మహిళా కానిస్టేబుల్ తనను అడ్డుకోవడం తనకు బాగా నచ్చిందన్నారు. ఎవరైనా సరే ఇలాగే అడ్డుకోవాలని చెప్పారు. తనను ఫోన్ తో లోపలికి అనుమతించని మహిళా కానిస్టేబుల్ ను అభినందించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. ఆ మహిళా కానిస్టేబుల్ ను అభినందిస్తున్నారు. పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ తరుణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఎవరినైనా సరే క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తున్నారు. 


 



పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే పేపర్ లీక్


తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారులకు షాక్ తగిలింది. పరీక్ష ప్రారంభమై ఏడు నిమిషాలకే పేపర్‌ లీక్ అయింది. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో తెలుగు పేపర్ లీకైనట్టు అధికారులు గుర్తించారు. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభమైంది. ఇంతలోనే పేపర్ లీక్ కావడంతో అంతా అవాక్కయ్యారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే లీక్‌ ఎలా అయిందనే అనుమానం అందరిలో వ్యక్తమైంది. లీక్‌పై ఆరా తీస్తే ఓ టీచర్ దీన్ని లీక్ చేసినట్టు తేల్చారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆయన్ని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. అసలు కారకులు ఎవరు దేని కోసం ఇలా లీక్ చేశారనే కోణంలో విచారణ సాగుతోంది.


రెండోరోజు హిందీ పేపర్ లీక్..


పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.  SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లుగా తెలుస్తోంది. ఈ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే హిందీ పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు ఒక మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన హస్తం కూడా ఈ వ్యవహారంలో ఉందని వెల్లడించారు.