Telangana Latest News: తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ. కులగణన సర్వేని బహిరంగంగా తగులబెట్టి అధిష్టానం ఆగ్రహనికి గురైన మల్లన్న, తేగేవరకూ లాగి చివరకు అధికార కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ, అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఎమ్మెల్సీ మల్లన్న, ఆ తీన్‌మార్ మల్లన్నేనా అనేంతలా పరిస్థితులు మారిపోయాయి. లేకా పరిస్థితులకు అనుకూలంగా మల్లన్న మారిపోయారా అనిపిస్తోంది ఆయనను దగ్గరగా గమనిస్తున్నవారికి. తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. మండలికి పంపిన బిల్లు సైతం ఆమోదం పొందింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..
ఏ కులగణన సర్వే తప్పుల తడక అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై దుమ్మెత్తిపోశాడో మల్లన్న, అదే కులగణన సర్వే ఆధారంగా బీసీలకు కేటాయించిన 42శాతం రిజర్వేషన్లకు మాత్రం మద్దతు తెలిపేశారు. బీసీ జనాభా సర్వేలో తగ్గించారు. లక్షల మంది బీసీలు, బతికున్న చనిపోయినట్లుగా సర్వేలో తప్పుడు లెక్కులు చూపించారు అంటూ రోజుల తరబడి ప్రచారం చేసిన మల్లన్నకు ఇప్పుడు ఏమైంది. కులగణన సర్వేపై ఆగ్రహంతో ఆ ప్రతులు కాల్చివేసి, బహిరంగంగా చేసిన విమర్శలే కదా మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. జరిగిన నష్టం జరిగిపోయిన తరువాత ఇప్పడు మళ్లీ సర్వే ఆధారంగా కేటాయించిన రిజర్వేషన్లపై మల్లన్న ఎందుకు మెత్తబడ్డారు. బీసీలకు మద్ధతుగా ఒక్క గొంతు అరచి గీపెట్టుకున్నా ఫలితం లేదు అనుకుని సర్దుకుపోయారా, లేక ఒకవేళ తాను బిల్లును వ్యతిరేకిస్తే ఎవరైతే తన బలంగా భావించి రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాడో అటువంటి బిసిలను దూరం చేసుకుంటే రాజకీయం మనుగడ కష్టమని భావించారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడిగింది ఎలాగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వదు, ఇచ్చిన దానితోనే సర్దుకుపోదామని వెనక్కి తగ్గారు అనే వాదలు కూడా ఉన్నాయి. ఇలా మల్లన్న నాలుక మడతపెట్టడంపై రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా... బిసిలకు వ్యతిరేకత లేకండా సేఫ్ గేమ్ అడుతున్నారని అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా కేటిఆర్‌ను మల్లన్న అసెంబ్లీ లాబీలో కలవడం పెనుదుమారం రేపింది. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు రోజూ కేసిఆర్, కేటీఆర్,హరీష్‌రావు ఇలా గత ప్రభుత్వాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తన సోషల్ మీడియా వేదికపై దుమ్మెత్తిపోశారు మల్లన్న. ఆయన చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కాదు, ఒక్కమాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం కూలిపోవడంలో మల్లన్న విమర్శలు సైతం కొంతవరకూ పని చేశాయి. ఇప్పుడు కేటీఆర్‌ను కలిసిన మల్లను చూస్తుంటే తీన్‌మార్ మల్లనేనా అనిపిస్తోంది. బిసి బిల్లుకు బిఆర్‌ఎస్ మద్ధతు కోరడంతోపాటు జంతర్‌మంతర్ దీక్షకు రావాలంటూ కేటీఆర్‌ను ఆహ్వానించడం, గతం గతః అన్నట్లు కేటీఆర్ సైతం నవ్వుతూ మల్లన్నతో మంతనాలు చేయడం చూస్తున్నవారు సైతం షాకైయ్యారు. బిఆర్ఎస్ మద్దతు ఎలాగో కాంగ్రెస్ కోరుతుంది. కానీ పని గట్టుకుని మల్లన్న కేటీఆర్‌ను కలవడం చూస్తుంటే బిఆర్‌ఎస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా అనే టాక్ కూడా వినిపిస్తోింది.
ఇదిలా ఉంటే మల్లన్న తాజాగా వ్యహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు లేకపోలేదు. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మల్లన్న ఉన్నట్లుండి ఎందుకిలా మారిపోయారు. బిఆర్ఎస్‌ను పొట్టుపొట్టున తిట్టి, రేవంత్కు జాన్ జిగిరి అయ్యాడు. మరి ఉన్నట్లుండి ఇలా రేవంత్‌కు రామ్‌రామ్ చెప్పి బిఆర్‌ఎస్ నేతలతో మంతనాలు చేయడానికి అంత వ్యక్తిగత కారణాలు లేవు. అలా అని బిసిల కోసమే అంటే ఇప్పడు ఇచ్చిన రిజర్వేషన్‌తో సరిపెట్టకుంటూ సై అంటున్నారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు మల్లన్న పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు అందుకే కటీఫ్ చెప్పినట్లే చెప్పి, కార్యాచరణ మాత్రం అమలు చేస్తున్నారానే విమర్శలు వినిపిస్తున్నాయి.