Former Maoist Leader Jampanna: ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, గిరిజన ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యమానికి ప్రజలు దూరంగా ఉండటంతో మావోయిస్టు ఉద్యమం క్షీణ దశకు వచ్చిందని మాజీ మావోయిస్టు జంపన్న అంటున్నారు. క్షీణ దశలో ఉన్న ఉద్యమాన్ని శాంతియుతంగానే ఎదుర్కోవాలని బలవంతంగా అణిచివేస్తే మళ్లీ వేరే మార్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అంటున్నారు.
ఏబిపి దేశం: తుపాకీతోనే ప్రజారాజ్యం వస్తుంది. తుపాకీతోనే న్యాయం జరుగుతుందని దశాబ్దాల క్రితం అడవిలోకి వెళ్లిన అన్నలు ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారు?
జంపన్న(మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు): దశాబ్దాలుగా మావోయిస్టులు అనేక ఎన్ కౌంటర్లు, దాడులు ఎదుర్కొన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత మావోయిస్టుల అణచివేత, దాడులు విపరీతంగా పెరిగాయి అనేది వాస్తవం. 2007లో మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశానికి మావోయిస్టులు ప్రమాదమంటూ అనేక సార్లు దాడులు చేసిన చరిత్ర దేశవ్యాప్తంగా ఉంది. గ్రీన్ హంట్ ఆపరేషన్, సల్వాజుడుం ఉద్యమాలు కూడా అప్పట్లోనే మొదలయ్యాయి. ఇవన్నీ జరుగుతూ వస్తున్న క్రమంలో 2009 తరువాత భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం బలహీన పడుతూ వస్తోంది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మావోయిస్టులపై దాడులు మరింత తీవ్రతరం చేయడం, బలగాలను భారీ ఎత్తున మోహరించారు. ఇలా సాయుధ పోరాటానికి అనుకూల పరిస్ధితులు లేకుండా పోయాయి.
ఏబిపి దేశం: మావోస్టులు ఈ తరహా అణచివేతలు, దాడులు దశాబ్దాలుగా ఎదుర్కుంటూనే ఉన్నారు. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఇప్పుడెందుకు సాయుధపోరాటం వదిలేస్తాం, తుపాకీ వదిలేస్తామని ఎందుకు అంటున్నారు? మోడీ కాకుండా ఇతర కారణాలేమున్నాయి.?
జంపన్న (మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు): అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వచ్చిన అనేక మార్పులు మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపాయి. అడవులలోకి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ విపరీతంగా పెరిగింది. మనుషుల ఆలోచనా విధానంలో కూడా అనూహ్య మార్పులొచ్చాయి. గతంలో పూర్తికాలం సాయుధ పోరాటానికి సిద్దమైన వ్యక్తులు మావోయిస్టులుగా మారేవారు. ఇప్పుడు పూర్తి స్థాయి పోరాటానికి ఆసక్తి చూపే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
బయట సమాజంలో ఉంటూ ప్రజలను చైతన్యవంతం చేయకుండా, అడవిలో ఉండి మనం మాత్రమే ఒంటరవుతున్నాం. అమాయక గిరిజనుల ప్రాణాలు ఎన్ కౌంటర్‌లలో పోతున్నాయి. మావోయిస్టు నాయకుల కంటే అమాయక ప్రజలే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఉద్యమం ముందుకు తీసుకెళ్లే అనుకూల పరిస్ధితులు లేవు. దాడులు మాత్రమే కాదు, దళంలో కొత్త వారు చేరడం కూడా బాగా తగ్గిపోయింది. ప్రజాసంఘాలు కూడా గతంలో మాదిరిగా క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. ఇలా అనేక విషయాలు గమనించిన తరువాత ఇక మావోయిస్టులు అడవుల్లో ఉండేందుకు అనుకూల పరిస్ధితులు లేవని ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించ దగ్గ విషయం. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకోవాలంటే, లేదంటే మళ్లీ ఈ పరిస్ధితులు మారిపోతాయి.
ఏబిపి దేశం: 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామనే ధీమాతో కేంద్రం ముందుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో మావోల అభ్యర్ధన కేంద్రం పట్టించుకుంటుందా? చివరి వరకూ వచ్చాం కాదా.. ముగించేద్దామని ముందుకెళతారా ?
జంపన్న (మావోయిస్టు మాజీ కేంద్రకమిటీ సభ్యుడు): ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది మావోలను చంపడం మా ఉద్దేశ్యం కాదని. వాళ్లు జనజీవన శ్రవంతిలోకి వస్తే చంపాల్సిన అవసరం మాకు లేదని చాలా సార్లు స్పష్టంగా చెప్పింది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. శాంతి కోసం మేం సిద్దమంటూ కొందరు ఛత్తీస్‌గఢ్ మంత్రులు స్పందిస్తున్నారు.
ప్రభుత్వం బాధ్యత శాంతిని స్థాపించడం తప్ప మరొకటి ఉండకూడదు. ఇంతలో మావోయిస్టులు తుపాకుల వదిలేస్తాం, సాయుధ పోరాటం ఆపేస్తాం అని లేఖ ద్వారా చెబుతున్నప్పుడు, కచ్చితంగా కేంద్రం చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా మావోయిస్టులను చంపుకుంటూపోతే, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఎలా స్పందిస్తుందనేది కేంద్రం విజ్జతపైనే ఆధారపడి ఉంది.