Hyderabad News: వాతావరణ సమాచారం అనగానే జోన్ల వారీగా వచ్చేది. ఓ జోన్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయో అంచనా కొద్దీ అధికారులు వివరాలు వెల్లడించేవారు. అయితే ఇప్పుడు డివిజన్ల వారీగా వేర్వేరుగా వాతావరణ సమాచారం అందించేలా కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భారత వాతావరణ కేంద్రంతో కలిసి జీహెచ్ఎంసీ ఈ ఒక్క వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. ఆరు జోన్ల పరిధిలో 150 డివిజన్లకు (వార్డులు) వేర్వేరుగా వాతావరణ సమాచారం అందనుంది. ఇందుకోసం హైదరాబాద్ వాతావరణ సాఖ, జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాడార్ వ్యవస్థలో నగరంలోని డివిజన్ల పటాలను చేర్చుతున్నారు. దీంతో వర్షాలు, ఎండలు, చలి, ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు వంటి వాతావరణ సమాచారాన్ని మరింత కచ్చితత్వంతో తెలుసుకోవడం సాధ్యం అవుతుందని దాంతో సహాయక చర్యలను వేగంగా తీసుకునే వీలు ఉంటుందని జీహెచ్ఎంసీ విపత్తు స్పందన దళం వెల్లడించింది.






150 డివిజన్ల పటాలు చేర్చి వాతావరణ సమాచారం సేకరణ


బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయలో రాడార్లు ఉంటాయి. వాటి ద్వారా ప్రస్తుతం మూడు రకాల వాతావరణ సమాచారం అందుతోంది. చుట్టూ 250 కిలోమీటర్ల దూరాన్ని జల్లెడ పట్టే రాడార్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి జిల్లాల వారీగా వాతావరణ సమాచారం అందుతోంది. మరో వ్యవస్థ ద్వారా 100 కిలోమీటర్ల పరిధిలో, ఇంకో వ్యవస్థ ద్వారా 25 కిలో మీటర్ల పరిధిలో వాతావరణ సమాచారం అందుతోంది. 25 కిలోమీటర్ల దూరాన్ని పరిశీలించే రాడార్ ద్వారా ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలోని 6 జోన్లు, షాద్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాలు, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాలోని కొంత భాగానికి సంబంధించిన వాతావరణ సమాచారం వెల్లడించే వారు అధికారులు. ఇదే 25 కిలో మీటర్ల రాడార్ లో జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పటాలు చేర్చి, వార్డుల వారీగా సమాచారాన్ని తీసుకోవాలని ఈవీడీఎం విభాగం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి సూచించారు. ఈ మేరకు వాతావరణ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది.


హైదరాబాద్ కు ప్రత్యేక వ్యవస్థ






ఐఐటీ హైదరాబాద్, హెచ్ఎండీఏ, టీఎస్డీపీఎస్, ఇతర సంస్థలతో కలిసి గర కాంటూర్ స్థాయిలు, ఎంత వర్షం పడితే ఏయే ప్రాంతాలు మునుగుతాయి, వరద ప్రవాహ మార్గం, ఆయా ప్రాంతాల్లోని చెరువులు, నాలాల సామర్థ్యం ఎంత అనే అన్ని రకాల వివరాలతో కూడిన 3డి సమాచారంతో సాఫ్ట్ వేర్ తయారు అవుతోంది. ఇందుకు రూ. 50 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్త వ్యవస్థ పూర్తిగా నగర యంత్రాంగం ఆధ్వర్యంలో పని చేస్తుంది. గతంలో వాతావరణ శాఖ రాడార్లు పని చేయక సమస్యలు వచ్చేవి. కాబట్టి హైదరాబాద్ కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ కంట్రోల్ రూమ్ వెహికల్ నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ అప్ డేట్లు కచ్చితంగా తెలుసుకోవచ్చని హర్షిస్తున్నారు.