Viral Video: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 22వ తేదీన జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో వైరల్ గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వెళ్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై ఆకస్మాత్తుగా బోల్కతా కొట్టింది. డ్రైవర్ ఫోన్ చూస్తూ.. ఆటో నడిపాడు. ఈక్రమంలోనే ముందుగా వెళ్తున్న బైక్ ను తప్పించబోయాడు. కానీ అదుపుతప్పి బోల్తా కొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన ప్రయాణికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆటో బోల్తా కొట్టబోతున్నట్లు గుర్తించిన ప్రయాణికులు.. ముందుకు వేగంగా రాకపోవడంతో ఇతర ఏ వాహనాలు ప్రమాదానికి గురి కాలేవు.
ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. మనం కూడా వార్తల్లో వాటి గురించి వింటూనే ఉంటాం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు
ఇది భారత దేశంలో చాలా తీవ్రమైన సమస్య. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటూ, ఖరీదైన జరిమానాలు విధిస్తున్నా, వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి.
డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు
కారు అయినా, బైక్ అయినా చాలా మంది ఈ అజాగ్రత్తతో కనిపిస్తుంటారు. రైడర్ లేదా డ్రైవర్ దృష్టి రోడ్డుపైనే ఉండాలి. తద్వారా ప్రమాదం లాంటి పరిస్థితి తలెత్తదు. కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది.
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపకూడదు
భారత దేశంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం కూడా తీవ్రమైన తప్పు. హెల్మెట్ ఉపయోగించడం ద్వారా రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా తలకు గాయం అయినప్పుడు కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అయినప్పటికీ చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చూడవచ్చు.
ఆకస్మిక లేన్ మారకూడదు
ద్విచక్ర వాహనం అయినా, నాలుగు చక్రాల వాహనమైనా అన్ని వాహనాల్లో సూచికలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు తమ కారును రోడ్డుపై నడుపుతున్నప్పుడు కుడి వైపు లేదా ఎడమ వైపు ఒకేసారి తిప్పుతారు. కొన్ని సార్లు ఎడమ వైపు నుంచి ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తారు. ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది.
ఓవర్‌లోడింగ్ చేయకూడదు
చిన్న వ్యాపారం చేసే చాలా మంది వ్యక్తులు తమ బైక్ లేదా స్కూటర్ ద్వారా వస్తువులను తీసుకు వెళతారు. ఇందులో గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు కూడా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై అధిక లోడ్ కారణంగా దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది.