Ganesh Utsav 2025: అత్యంత వైభవంగా హైదరాబాద్‌లొో గణపతి శోభా యాత్ర, లక్షలాదిగా గణేష్ విగ్రహాల నిమజ్జనం ఈనెల 6వ తేది ముగిసింది. హుస్సేన్ సాగర్‌లోకి భారీ గణనాథుల విగ్రహాలు, ప్రతీ ఇంట్లో పూజించిన చిన్న విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తెచ్చి గంగమ్మ ఒడికి సాగనంపారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ తాజాగా హుస్సేన్ సాగర తీరంలో ముక్కలుగా , చెత్తకుప్పలో పడిఉన్న గణపతి విగ్రహాలు కలచివేస్తున్నాయి.

Continues below advertisement


11రోజులపాటు నిష్టగా వినాయకుడిని పూజించి,  స్వామికి చిన్న లోటు జరగకుండా నైవేధ్యాలతో మొక్కులు తీర్చుకున్నారు.  ఇప్పుడు హుస్సేన్ సాగరతీరంలో వినాయకుడి విగ్రహాలు మురికి కూపంలో పడి ఉన్నాయి. చుట్టూ చెత్త, డప్పింగ్ యార్డ్ ను తలపించేలా, వ్యర్దాల మధ్య గణపతి విగ్రహాలు విసిరివేసినట్లుగా పడివున్నాయి. ఇన్నాళ్లు పూజించి నిమజ్జనం తరువాత గణపతికి తీరని అవమానం చేస్తున్నామా అనే వాదనలకు బలం చేకూరుతుంది.



హైదరాబాద్ నగర వ్యాప్తంగా లక్షా నలభైవేల మండపాలు ఏర్పాటు చేశారు. వినూత్నంగా విగ్రహాలు, ఎత్తైన విగ్రహాలు, అందమైన ఆకృతిలో గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ దాదాపు ఎక్కవశాతం మండపాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలే. ఇప్పుడు అవే విగ్రహాలు నిమజ్జనం తరువాత ముక్కలుగా హుస్సేన్ సాగర్ ఒడ్డున పడిఉన్నాయి. చెత్త కుప్పలో ఇష్టదైవాన్ని విసిరేసినట్లుగా పరిస్దితులు దర్శనమిస్తున్నాయి. మన వీధిలో, కాలనీలో భక్తిశ్రధ్దలతో మొక్కిన గణపతికి ఇప్పుడు ఈ దుస్దితేంటనే ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగవు, వాటివల్ల సాగర్ లో కాలుష్యం తప్పదు. ఇవన్నీ తెలిసినా , మీడిాయా ద్వారా విపరీతంగా ప్రచారం చేస్తున్నా, మార్పు మాత్రం అంతంత మాత్రమే. ఫలితం ఇదిగో ఇలా బొజ్జగణపతికి భక్తి రూపంలో మనం చేస్తున్నది తీరని పాపం కాదా..? పవిత్రంగా పూజించి ఇలా అపవిత్రంగా విసిరేస్తామా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



మట్టి విగ్రహలు ప్రతీ మండపంలో ఏర్పాటు చేస్తే, ప్రతీ ఇంట్లో మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తే.. గణేష్ నిమజ్జనం తరువాత హుస్సేన్ సాగర తీరాన ఈ  హృదయవిదారక దృశ్యాలు ఉండవు. దేవ దేవుడికి అవమానం జరగదు. మట్టి విగ్రహాలు సాగర్ లో నిమజ్జనం చేసిన కొద్దిసేపటికే కరిగిపోతాయి. కొత్త మట్టి సాగర్ గర్భంలోకి చేరుతుంది. కొత్త మట్టితో నీటి శుద్ది జరుగుతుంది. భరించలేని కంపుతో హుస్సేన్ సాగర్ వద్ద సందర్శకులు ఇబ్బందులు పడే పరిస్దితులను దూరం చేయవచ్చు. ఇలా అన్నీ తెలిసినా, ఆచరణలో మాత్రం లైట్ తీసుకోవడం వల్ల కెమికల్ కలగలసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ప్రతీ ఏడాాది పెరిగిపోతోంది.



విగ్రహాలు అందంగా ఉంటే సరిపోతుందా, నిమజ్జనం తరువాత ఆ విగ్రహాల దుస్దితి ఏళ్లతరబడి చూస్తున్నాం కానీ మార్పు కోసం ప్రయత్నం చేయడంలో అదే నిర్లక్ష్యం కొనసాగిస్తున్నాం. జై బోలో గణేష్ మహరాజ్ కి అంటూ గొంతెత్తి నినదిస్తున్నాం కానీ నిమజ్జనం తరువాత నీకు అవమానం జరగదు వినాయకా అని చెప్పలేకపోతున్నాం. ఇలాంటి దృష్యాలు చూసినప్పుడైనా, మన ఇంటి వినాయకుడికి మురికి కూపంలో జరుగుతున్న అవమానం యాదికి రావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ప్రతీ ఒక్కరూ వినాయకుడి జై కొట్టేలా వచ్చే ఏడాదైనా మార్పు తేవాలని బొజ్జగణపయ్యను వేడుకుందాం.