Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పులు కారణంగా తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మంగళవారం నుంచి వానలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర మీదుగానే కొనసాగుతున్నందున భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడితే మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాలు ప్రకారం బుధవారం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. అక్కడ ఒక్కరోజే 6.1 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత స్థానం తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్ట ఉంది.       

గురువారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.   

పవన్ బాపట్ల పర్యటన రద్దు  

వర్షాలు కారణంగా పవన్ కల్యాణ్ బాపట్ల పర్యటన రద్దు అయ్యింది. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బాపట్లలో పర్యటించి సూర్యలంక  రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో ఏర్పాటు చేసిన స్థూపాన్ని ప్రారంభించాల్సి ఉంది. రాజమండ్రి నుంచి తెచ్చిన ప్రత్యేక మొక్కలను ఇక్కడ నాటాలని ప్లాన్ చేశారు. కానీ ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ దిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అందుకే చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయినట్టు ప్రకటన వెలువడింది.    

తెలంగాణలో వాతావరణం  

తెలంగాణలో కూడా దాదాపు అన్ని జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. బుధవారం హైదరాబాద్‌సహా పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. పిడుగులతో కురిసిన వర్షానికి భారీ విధ్వంసం జరిగిది. ఇలాంటి పరిస్థితి 14వ తేదీ వరకు ఉంటుంది. ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో నేడు జోరు వానలు కురుస్తాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.         

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పిడుగు వర్షం కురిసింది. నిర్మల్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు ఎనిమిది మంది చనిపోయారు. ఇందులో రైతులు నలుగురు, వ్యవసాయ కూలీలు ముగ్గురు ఉన్నారు. మరో ఐదుగురు వ్యక్తులు పిడుగుపాటుకు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇవాళ కూడా పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.