హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జూన్ 28న ప్రారంభం కానున్న టీ హబ్ 2.0 భవనం అందర్నీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ నిర్మాణ శైలికి భిన్నంగా ఈ భవన డిజైన్ ఉంది. భవనం వెడల్పులో దాదాపు సగ భాగం వరకూ ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలోనే ఉండడం దీని ప్రత్యేకత. ఈ భవన ఆకృతిని చూస్తే అధునాతన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించినట్లుగా అర్థం అవుతోంది.


అయితే, ఈ టీ హబ్ భవనం రాత్రి వేళ కనిపిస్తున్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా, వాటిని మెచ్చుకుంటూ హీరో విజయ్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. హైదరాబాద్ ఇప్పటికే గొప్ప పేరు కలిగి ఉందని, కలర్ ఫుల్ అయిన ఈ అందమైన నగరంలో ఇప్పుడు మరో ఇన్నోవేషన్ టీ హబ్ చేరిందని సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ చేశారు. గ్రేట్ విజన్, వెరీ ఫ్యూచరిస్టిక్ అంటూ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.






విజయ్ దేవరకొండ కూడా దీనిపై స్పందించారు. భవిష్యత్తు కోసం ఇది ఎంతో గొప్పదని కొనియాడారు. యంగ్ బిజినెస్‌లకి (స్టార్టప్) ఇక్కడ సానుకూల వాతావరణం ఉందని, ఇక్కడ అనేక ఉద్యోగాలు ఏర్పడతాయని ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రేమించాలంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.






జూన్ 28న ప్రారంభం
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ 2.0 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ గా ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీ హబ్ 2.0 భవనాన్ని ప్రారంభించనున్నారు.


హైదరాబాద్‌లో టీ హబ్‌ 2.0 ను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, విశాలంగా, వినూత్నమైన నిర్మాణ శైలిలో చూడగానే ఆకట్టుకునేలా నిర్మించింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని రూపొందించారు.


తొలుత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 28న టీ హబ్ 2.0 ప్రారంభం సందర్భంగా టీ హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.