టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ నియమితులు అయ్యాక కీలకమైన మార్పులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన మార్పులు చేర్పులు ఉంటున్నాయి. ఆ మార్పులు కూడా ట్రెండ్‌కి తగ్గట్లుగా యువతను ఆకట్టుకొనేలా ఉంటూ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా దసరా సమయంలో ఆయన ఓ ప్రకటనను తయారు చేయించారు. అయితే, అది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసినది మాత్రం కాదు.. అతి సామాన్యమైన యాడ్. పైగా ట్రెండింగ్‌లో ఉన్న మీమ్‌ను తీసుకొని టీఎస్ ఆర్టీసీ భద్రతపై అవగాహనకు ఆపాదించారు. ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రకటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఒక టీ పొడి కంపెనీ రూపొందించిన యాడ్ ఇటీవల ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే కదా.. ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. పక్కనే టీ కొట్టు పెట్టాను. అందరికీ ఫ్రీగా టీ ఇస్తున్నాను.. ఈరోజు డబ్బులేమీ తీసుకోవడం లేదు.. డబ్బులు ఇవ్వడం లేదులేగానీ.. సుఖీభవ’’ అనే యాడ్ విపరీతంగా జనం నోళ్లలో నానుతోంది. ఈ మీమ్‌నే టీఎస్ఆర్టీసీ కూడా ఉపయోగించుకుంది. ‘‘అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభవ సుఖీభవ నమ్మకానికి భరోసా మన టీఎస్ఆర్టీసీ.. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, మరియు శుభప్రదం’’ అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Also Read: Jubilee Hills: భార్య వేలు కట్ చేసి పారిపోయిన భర్త.. వెతుకుతున్న జూబ్లీహిల్స్ పోలీసులు
ఆ వీడియోలో ఉన్న ప్రకారం.. ఊరికి వెళ్తున్న ఓ వ్యక్తి లగేజీ పట్టుకొని వెళ్తూ జీపులో వెళ్లొస్తానంటూ చెప్పగా.. రోడ్డుపై ఉన్న యువకులు.. అయ్యయ్యో వద్దన్నా.. పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది.. క్షేమంగా వెళ్లొచ్చు.. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోరు.. కానీ, సుఖీభవ.. సుఖీభవ.. సుఖీభవ’’ అంటూ తీన్మార్ డాన్సులు చేస్తూ చెప్పారు. పక్కా పల్లెటూరి వాతావరణంలో తీసిన ఈ వీడియో విపరీతంగా జనాల్ని ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ బస్సుల ప్రాముఖ్యాన్ని కూడా చాటి చెబుతోంది.
పైగా ఇది దసరా సీజన్ కావడంతో సరిగ్గా టైం చూసుకొని ఈ యాడ్ లాంటి వీడియోను బయటికి వదిలారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం స్పెషల్ బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
Also Read: Hyderabad Theft: ఇంట్లో చోరీ.. వృద్ధురాలి తెలివితో వెంటనే పట్టుబడ్డ దొంగ, ఆ టెక్నిక్ ఏంటంటే..
Also Read: పవన్ కల్యాణ్ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?