హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో వైశాలి అనే వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వైశాలిని మిస్టరీ టీ వ్యవస్థాపకుడైన నవీన్ రెడ్డి గతేడాది డిసెంబరులో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్‌ అప్పుడే నమోదు చేశారు. దానిని తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 


రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో వైశాలి అనే మెడిసిన్ స్టూడెంట్ కిడ్నాప్‌ కేసు గతేడాది డిసెంబరులో  సంచలనంగా మారింది. వైశాలిని నవీన్‌ డిసెంబర్‌ 9న కిడ్నాప్‌ చేశాడు. తన ఫ్రెండ్స్, అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడి చేసి, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను కొంత దూరంలో వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటిదాకా దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవీన్‌ రెడ్డిని కూడా పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. 


నవీన్ రెడ్డి నుంచి పోలీసులు వాస్తవాలు రాబట్టారు. రిమాండ్‌ రిపోర్టులో నవీన్‌ రెడ్డి వైశాలికి పెళ్లి కాలేదని వాస్తవాన్ని పోలీసులు వెల్లడించారు. వైశాలి పెళ్లిని అడ్డుకునేందుకే గతంలో బాపట్ల పెళ్లి డ్రామా ఆడినట్లు నవీన్ ఒప్పుకున్నాడు. తన వద్ద పనిచేసే వాళ్లతో వైశాలి ఇంటిపై దాడిచేయించానన్నాడు నవీన్‌ రెడ్డి. తనను పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్‌ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ టీకి చెందిన 40 మందితో వైశాలి ఇంటిపై దాడి చేయించినట్లు చెప్పాడు. ఈ కిడ్నాప్‌ ఉదంతం సంచలనం కావడంతో భయంతో గోవా పారిపోయినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు.  అయితే పెళ్లి డ్రామా అబద్దమని తెలిసిన తర్వాత... వైశాలి తనని మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు అవాస్తవాలు కావొచ్చన్న అనుమానాలు రేగుతున్నాయి. 


నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో


సెల్ఫీ వీడియోలో నవీన్ రెడ్డి ఓపెన్ అయ్యాడు. తాను చేసింది తప్పేనని ... కానీ దాని వెనుక చాలా పెయిన్ దాగుందని అన్నాడు.  తనకున్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగానే తాను పోలీసులకు సరెండర్ కాలేదని పేర్కొన్నాడు. ఈ కిడ్నాప్ విషయంలో తనను మాత్రమే నెగెటివ్‌గా చూస్తున్న వాళ్లంతా.. ఒకవేళ తనకు జరిగినట్టే ఒక అమ్మాయికి జరిగి ఉంటే.. ఇలానే స్పందించే వాళ్లా అని ప్రశ్నించాడు.  ఈ విషయాన్ని ఒక అమ్మాయికి జరిగిందనో.. ఒక అబ్బాయికి జరిగిందనో చూడకుండా.. ఒక ఫ్యామిలీకి, ఒక మనసుకు సంబంధించిన విషయంగా చూడాలని రిక్వెస్ట్ చేశాడు.


నవీన్ రెడ్డి అరెస్టు అనంతరం రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు తరలించారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ నేడు (జూన్ 12) ఉత్తర్వులు ఇచ్చింది.