Apsara Murder Case: అప్సర హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. అప్సరకు ఇప్పటికే పెళ్లి అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలోనూ అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అప్సర, చెన్నైకి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాను ప్రేమ వివాహం చేసుకుందని ప్రచారం నడుస్తోంది. ఆ తర్వాత కొంత కాలానికే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కూడా సమాచారం.


ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఓ ఆడియో వైరల్‌గా మారింది. అప్సర పెళ్లి చేసుకున్న వ్యక్తి తల్లి పేరుతో ఓ ఆడియో నెట్టింట తిరుగుతోంది. తన కుమారుడిని అప్సర మానసికంగా వేధించడం వల్లే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లి ధనలక్ష్మి చెబుతోంది. పెళ్లైన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారని వివరించారు. ఈ క్రమంలోనే తల్లీకూతుర్లు ఇద్దరూ తన కొడుకుతో గొడవ పడేవారని చెప్పారు. గొడవలు మరింత ఎక్కువయ్యాక పోలీస్ స్టేషన్ లో తన కుమారుడిపై కేసు కూడా పెట్టారని చెప్పారు. అది తట్టుకోలేకే కార్తీక్ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లి అరుణనే కారణం అని చెప్పుకొచ్చారు. 


తన కుమారుడి ఆత్మహత్య తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారని... అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తలు చూసి తెలుసుకున్నట్లు ధనలక్ష్మి తెలిపారు. వారిద్దరూ హైదరాబాద్ లో ఉంటున్న వార్త కూడా తమకు తెలియది.. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని.. అందుకోసమే వాళ్లు హైదరాబాద్ కు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నట్లు కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ తెలిపారు.  


అస్పర తల్లి కూడా ఈ వార్తలపై స్పందించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు చనిపోయిందని.. ఆ బాధలో నుంచి ఇప్పటికీ తమ కుటుంబం బయటకు రాలేకపోతుందని చెప్పారు. హంతకుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కావాలనే తమ కూతురిపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తన కూతురు ఆత్మకు శాంతి కల్గకుండా చేస్తున్నారని వాపోయారు. కూతురు చనిపోయిన బాధలో తాము ఉంటే.. తమ పరువును బజారుకు ఈడ్చే పనులు చేయడం ఏంటని అరుణ ప్రశ్నించారు. అయితే అప్సరకు గతంలోనే వివాహం జరిగినట్లు నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు చూసి అరుణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


ఇద్దరి మధ్య వివాహేతర బంధం!


సరూర్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన అప్సర హత్య కేసు సంచలనంగా మారింది. వెంకట సాయికృష్ణ, అప్సర ఒకే వీధిలో ఉండేవారు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై ఓ పాప కూడా ఉంది.  అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్ప‌టికే ఒక‌సారి ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో సాయికృష్ణ అబార్ష‌న్ చేయించాడు.. తాజాగా అప్స‌ర మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని గ‌త రెండు నెలలుగా సాయి పై తీవ్ర ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ది. దీంతో ఆమెనుంచి తప్పించుకునేందుకు హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుని ప‌క్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 


హత్య చేసిన తర్వాత రోజంతా కారులోనే మృతదేహం 


అప్సరను హత్య చేసిన తర్వాత అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌ హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత  అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపించాడు. అప్సర కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతో పాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.