Nitin Gadkari in Hyderabad: కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. హైవేల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ లో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతుండగా, జనం నుంచి ‘జై శ్రీరామ్‌’ నినాదాలు హోరెత్తాయి. అంతేకాక, అదే సభకు హాజరైన తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతుండగా కూడా ‘జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకిజై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలగజేసుకొని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు.


సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం జరిగిందని అన్నారు. నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా వెల్లడించారు. హైదరాబాద్‌ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) సమగ్ర ప్రాజెక్టు నివేదిక పూర్తయిందని అన్నారు. ఇవన్నీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి ఇంకో మూడు నెలల్లో వస్తానని అన్నారు. ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేందుకు భూ సేకరణ తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లుగా చెప్పారు.


గ్రీన్ ఎక్స్‌ప్రెస్ రహదారులు
2014 నుంచి తెలంగాణలో 4,996 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించామని నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు ఉండగా, తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం తరపున రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇంకో రూ.5 వేల కోట్లతో హైదరాబాద్ విశాఖపట్నం రహదారి,‌ నాగపూర్ విజయవాడ హైవే కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని నితిన్ గడ్కరీ వివరించారు.


కాళేశ్వరం ప్రాజెక్టుకుతో హైదరాబాద్ నగరానికి మంచి నీళ్ల సమస్య తీరిందని గడ్కరీ తెలిపారు. తెలంగాణ శక్తిశాలి అయితేనే భారత్ కూడా శక్తిమంతంగా తయారు అవుతుందని వెల్లడించారు.