హైదరాబాద్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆపేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. ఆ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా 200 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు చేరుకుంటుందన్నారు. కానీ ఇంత దూరంలో కనీసం ఎక్కడా స్టాప్ లేదని, మహబూబ్ నగర్, షాద్ నగర్ లాంటి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగేలా చేయాలని కిషన్ రెడ్డి ప్రతిపాదించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత వాసులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు.  


చెంగల్ పట్టు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ రైలు స్టాప్ ఏర్పాటు చేసినట్లయితే హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లోని ప్రయాణికులు ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల వారికి రవాణా సౌలభ్యంగా ఉంటుందని రైల్వే శాఖ మంత్రికి లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గత నెల హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రూ. 1,410 కోట్లతో 85 కిలోమీటర్ల పొడవుతో సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య నిర్మించి, విద్యుద్దీకరించిన డబ్లింగ్ రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని అశ్వినీ వైష్ణవ్ కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రాంత వాసుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. 


ప్రధానిగా నరేంద్రమోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి తెలంగాణ రాష్ట్రంలో మౌలికవసతుల కల్పన వేగవంతంగా జరుగుతోందన్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ణనీయమైన పురోగతి జరుగుతోందన్నారు. రాష్ట్రానికి రైల్వే శాఖ అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. వందే భారత్ లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్లతో పలు రాష్ట్రాల్లోని నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా వరకు సేవ్ అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని ప్రధాన నగరాలకు ఒక్కొక్కటిగా వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.