సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జ్ కింద ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ ఘటనపై కేంద్ర రవాణా శాఖ విచారణకు ఆదేశించింది. ఆ ఘటనలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ నేడు ఘటనా స్థలంలో విచారణ జరపనుంది. బ్యాటరీలు ఎందుకు పేలాయి? సెల్లార్ లో ఎలాంటి భద్రతా లోపాలు ఉన్నాయి? అని పూర్తిగా అధికారులు విచారణ చేయనున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ-బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తం అయింది. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే.


అసలేం జరిగిందంటే..? 
సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. బైక్ షోరూమ్ లో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసి పడ్డాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి లాడ్జిలో ఉన్నవారు చనిపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని తెలిపారు. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. రూబీ హోటల్ లో మొత్తం నాలుగు ఫోర్లలో 23 రూమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు ఫోర్లలోని వారు చనిపోయారని సీపీ తెలిపారు. ఆరుగురి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని యశోధ ఆసుపత్రికి తరలించారు. మంటలు వ్యాపించినట్లు హోటల్ పై నుంచి దూకిన వారెవరూ చనిపోలేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా 
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘‘బిల్డింగ్ సెల్లర్ ని మిస్ యూస్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. 8 మంది స్మోక్ ద్వారానే చనిపోయారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.


కేంద్రం నుంచి రూ.2 లక్షలు పరిహారం
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. 


‘‘సికింద్రాబాద్‌లో జరిగిన ప్రమాదంలో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. చనిపోయిన వారి కుటుంబాల వారికి సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి చనిపోయిన వారి కుటుంబాల వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.