Accused arrested in Secunderabad Fire Accident Case: సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన తరువాత నుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నలుగురి అరెస్టు చేశారు.
విషయం తెలుసుకుని తండ్రీకొడుకులు పరార్..
సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ ను సోమవారం రాత్రి దాదాపు 9 గంటలకు మూసివేశారు నిర్వాహకులు రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్. దాదాపు 45 నిమిషాలకు లాడ్జి నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిప్రమాదం జరగిందని వెంటనే అక్కడికి రావాలని సమాచారం రావడంతో రూబీ లాడ్జ్, షోరూంకు వెళ్లినప్పటికీ.. ఆ ఘటనలో 8 మంది చనిపోయారని తెలుసుకుని తండ్రీ కొడుకులు పరారయ్యారు.
అసలేం జరిగిందంటే..
రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో రన్ చేస్తుండగా.... మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. అయితే వెహికిల్ పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. ఇందులో షార్ట్ సర్క్యూట్ కావడంతో సోమవారం రాత్రి 9 గంటల తరువాత సెల్లార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని క్షణాల్లో మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. వాహనాల టైర్లు కాలటంతో భవనంలోని పై అంతస్తులో సైతం దట్టమైన పొగ వ్యాపించింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, పోలీసులు, స్థానికులు కొందర్ని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Secunderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో పొగ వల్లే 8 మంది మృతి, స్ప్రింకర్లు ఎందుకు పని చేయలేదంటే?
కేసు నమోదు చేసిన పోలీసులు
రూబీ ఎలక్ట్రిక్ షోరూం, లాడ్జి అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ మన్మోహన్ ఖన్నా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోండా మార్కెట్ పోలీసులు నిందితులపై 304 పార్ట్ 3, 324 ఐపీసీ అండ్ సెక్షన్ 9 బి ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ 1884 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
పలు ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స
రూబీ ప్రమాద బాధితులు ఐసీయూలో నలుగురు ఉన్నారు. అగ్నిప్రమాద క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 8 మంది మృతిచెందారు. కొంతమందికి గాంధీ, ఆపోలో, యశోద ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో యూపీకి చెందిన దీపకుమార్ యాదవ్.. కోల్‌కతా చెందిన ఉమేష్ కుమార్ ఆచార్య ఉన్నారు. ఆపోలోలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ నలుగురికి అంతర్గతంగా ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు వైద్యులు చెబుతున్నారు. వేడి కారణంగా గాయాలు కావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో గాంధీలో చేరిన ఇద్దరు కోలుకుని నిన్న డిశ్చార్జి అయ్యారు.
ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక
రూబీ లాడ్జి విషాద ఘటనపై తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలకమైన విషయాలు వెల్లడించారు అధికారులు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద తీవ్ర పెరిగిందన నివేదికలో స్పష్టం చేసింది. లిథియం బ్యాటరీల పేలుళ్ల వల్లే దట్టమైన పొగలు వ్యాపించాయని తేల్చింది తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్. పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది. లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యజమాని పట్టించుకోలేదని తెలిపింది. Also Read: రూల్స్ ప్రకారం ఒక్కటీ లేదు- రూబీ లాడ్జి విషాదంపై ఫైర్‌డిపార్ట్‌మెంట్ సంచలన రిపోర్ట్