Attack on cantonment MLA sri Ganesh | హైదరాబాద్: కాంగ్రెస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై కొందరు గుర్తుతెలియని దుండుగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్ నగర్‌లో ఫలహారం బండిని ఆదివారం రాత్రి ఊరేగిస్తుండగా 30 మంది యువకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్‌ని వెంబడించారు. అద్దాలు దించాలంటూ ఎమ్మెల్యే కారును వెంబడించి హంగామా చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకుని దాడికి యత్నించారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనంపైకి కొందరు దూసుకువచ్చారు.
ఓయూ పీఎస్ (OU Police Station)లో ఎమ్మెల్యే ఫిర్యాదు
ఎమ్మెల్యే శ్రీగణేష్ గన్‌మెన్‌ల నుంచి తుపాకీ సైతం యువకులు లాక్కునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులో నుంచి బయటికి రాలేదు. అప్రమత్తమైన గన్‌మెన్లు ఎమ్మెల్యే కారును ఓయూ పీఎస్ (OU Police station)కు తీసుకెళ్లాలని ఆ డ్రైవర్‌కు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓయూ పీఎస్ పోలీసులను ఆశ్రయించారు. మాణికేశ్వర్ నగర్‌లో బోనాల జాతరకు వెళ్తుండగా కొందరు తన కాన్వాయ్ ను అడ్డుకుని తనపై దాడిచేసి చంపాలని చూశారని ఫిర్యాదు చేశారు. ఎమ్యెల్యే శ్రీగణేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఓయూ పీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
హారన్ కొట్టడంతో ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నం..
ఈ ఘటనపై డీసీపీ బాలాస్వామి మాట్లాడుతూ.. ఆరు బైకులపై 13 మంది వ్యక్తులు వెళుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ కారుకు దారి ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారు డ్రైవర్ హారన్ కొట్టాడు. ఆ వ్యక్తులు గుంపులు గుంపులుగా మారి బండ్లను రోడ్డుమీద నిలిపి ఎమ్మెల్యే వాహనంపై తిరగబడి దాడికి యత్నించారు. గన్ మెన్లు కిందకు దిగగానే ఆ దుండగులు విద్యానగర్ వైపు వెళ్లినట్లు ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి వెల్లడించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డుపై హంగామా చేయడంతో పాటు ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు