KTR about National language |  జైపూర్: ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య ఆధారంగా డిసైడయ్యే కేంద్రప్రభుత్వం దక్షిణ భారతదేశ ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదని బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. జైపూర్ లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9 వ ఎడిషన్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మంద బలం, అధికారం ఉందని జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. 

బీజేపీ ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు..

కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న కేటీఆర్, తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తానని బిజెపి అనుకుంటే దాని పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కును కోల్పోకూడదు. బిహార్ లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ మొదటిసారి కాదు. ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.  ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? బిహార్ లో జరుగుతున్న పరిణామాలపై మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలపై ఇది ప్రభావం చూపనుంది. 

రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు , విద్వేషాలు సృష్టించడం చాలా సులభం. వారు, మనము అని ప్రజలను విడగొట్టే రాజకీయ కుట్రలకు అనుగుణంగా బిహార్ పరిణామాలు ఉన్నాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన , నిరసన తెలపనంత మాత్రాన అంతా బాగుందని కాదు. ఓటర్లు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు.  నగరాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణం. ఎన్నికల తరువాత ఫలితాల మీద మాట్లాడటం కంటే ఎన్నికలకు ముందే వాటిపై దృష్టి పెట్టాలి. ఇండియా లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి ఓటు కోల్పోయిన కూడా దానిమీద చర్యలు తీసుకోవాలి. బిహార్లో ఐదు లక్షల మంది ఓట్లు గల్లంతు అంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం.

తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన ఆర్జేడీగత ఎన్నికల్లో కేవలం 12,500  ఓట్ల తేడాతోనే అక్కడ ఆర్జెడి అధికారాన్ని కోల్పోయింది. భారతీయత మాత్రమే కోట్లాదిమందిని కలిపి ఉంచగలుగుతుంది. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం,  మతం, కులం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల సమస్యలను పార్లమెంట్లో మరింత సమర్థవంతంగా వినిపించడానికే రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ప్రతి రాష్ట్రానికి ఉన్న జనాభా ఆధారంగా పార్లమెంటులో ఆ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం ఉండాలని గతంలో పునర్విభజన జరిగేది. అందుకే గతంలో ప్రతి 10 ఏళ్లకు జనగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేది.

జనాభా విపరీతంగా పెరగడం కారణంగా 1971 లో రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంటు స్థానాలను 543 దగ్గర  ఫ్రీజ్ చేశారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ నియోజకవర్గ పునర్విభజన. ఈలోపు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణలో పకడ్బందీగా అమలు చేశారు. అందుకే 1948లో 26 శాతంగా ఉన్న సౌత్ ఇండియా పాపులేషన్ 19 శాతానికి తగ్గింది. 

ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉత్తరాది రాష్ట్రాలు ఫెయిల్ఉత్తర భారత దేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయలేక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 1950 నుంచి ఇప్పటివరకు 239 శాతం జనాభా పెరిగింది. అదే కేరళలో 69 శాతం మాత్రమే పెరిగింది. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ను అద్భుతంగా అమలుపరిచిన కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తక్కువ సీట్లు కేటాయించడం అన్యాయం కాదా? యూపీ లాంటి ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయని రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెంచి దక్షిణాదికి తగ్గిస్తామనడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదు.

చెన్నైలో మా అభిప్రాయం వెల్లడించాం

నియోజకవర్గాల పునర్విభజనలో జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. అందుకే మొన్న చెన్నైలో జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాం.  ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముందుగా అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేనే. అందుకే ఎమ్మెల్యే స్థానాలను పెంచాలన్నదే మా పార్టీ అభిప్రాయం. ఇప్పుడున్న ఎంపీ స్థానాలని అలానే కొనసాగించాలి.  ప్రధానిని ఉత్తర భారతదేశం నిర్ణయించాల్సి వస్తే.. రేపు ఆ ప్రభుత్వం ఆ ప్రాంతం ప్రయోజనాలకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. దక్షిణాది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోరు.

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వమని కేంద్రం ప్రభుత్వం చెబుతున్న మాటల్ని మేం నమ్మడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని.. ఇప్పటివరకు చేయలేదు. కానీ ఎవరు అడగకముందే వారి రాజకీయ ప్రయోజనాల కోసం జమ్ము కాశ్మీర్, అస్సాంలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచారు.

 

పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసిందో  అక్కడ మాత్రం ఎమ్మెల్యే స్థానాలను పెంచలేదు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఉత్తర భారత దేశంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా , ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ అంటే నాకు అభిమానం. దక్షిణ భారతదేశం నుంచి శశిధరూర్ కి మంచి భవిష్యత్తు ఉంది. అతను కాషాయం వైపు వెళ్తున్నారు. 

జాతీయ భాష అవసరం లేదు..దేశానికి ఒక జాతీయభాష ఉండాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం అద్భుతంగా పురోగమిస్తుంది. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశంలో భాషా, సంస్కృతి ,ఆహారం, వేషభాషలు మారుతాయి. ఈ విషయంలో యూరప్ నకు ఇండియాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.  ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనం ఇంకా కలిసే ఉన్నాము. జాతీయ భాష చేస్తే తక్కువ ప్రజలు మాట్లాడే భాషలు కాలక్రమంలో కనుమరుగు అవుతాయి. చాలా దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఇంగ్లీష్ తోనే అవకాశాలు లభిస్తాయి. హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందా ’ అని కేటీఆర్ ప్రశ్నించారు.